తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరు కరోనా సమయంలో వార్తలలో బాగా వినిపించింది. అయితే అంతకు ముందు నుంచే ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో వచ్చే ఆలోచనతో తన సొంత జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో తన పేరిట జీఎస్సార్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని సమాజసేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
కేసీఆర్ టికెట్ ఇస్తే ఈసారి కొత్తగూడెం నుంచి పోటీ చేయాలనుకొంటున్నట్లు ఇటీవలే మనసులో మాట బయటపెట్టేశారు. అందుకు ఆయనను తప్పు పట్టలేము. కానీ ఓ ప్రభుత్వాధికారిగా పనిచేస్తూ, రాజకీయాలు చేస్తుండటమే అభ్యంతరకరం.
శుక్రవారం ఆయన తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు (?)పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలలో ఆయన ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేసి, భారీ ర్యాలీలు చేశారు. ఆయన కూడా గదల పాల్వంచ మండలంలోని పెద్దమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేసి అభిమానులతో కలిసి వాహనాలతో భారీ ర్యాలీలో దమ్మపేట సెంటర్‌కు చేరుకొన్నారు.
దారిలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అభిమానులు ఆయనను గజమాలతో సన్మానించారు. తర్వాత అక్కడి నుంచి కొత్తగూడెం క్లబ్బుకు చేరుకొని కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.
అయితే పట్టణంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీ బ్యానర్స్ పెట్టినందుకు మునిసిపల్ సిబ్బంది వాటిని తొలగించగా, అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించినందుకు పోలీసులు ఆయనను దారిలో పలుమార్లు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్లబ్బులో తన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నియోజకవర్గంలో కూడా ఓ ప్రజాప్రతినిధి (కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య) కుమారుడు రావణాసురుడులా ఉన్నాడు. నేను ప్రజలకు సేవ చేస్తుంటే సహించలేక అతనే నన్ను అడ్డుకొంటున్నాడు. సింగరేణి బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ నిప్పు అంటితే భగభగమని మండుతుంది. నేనూ అంతే. నన్ను తక్కువగా అంచనా వేసేవారికి ఇదే నా హెచ్చరిక.
స్థానిక ప్రజాప్రతినిధి పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నా సదరు ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదు. కనుక కొత్త నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొందాము. త్వరలోనే “గడప గడపకు గడల... ఇంటికి కొడుకులా...” అనే కార్యక్రమం చేపట్టబోతున్నాను,” అని ప్రకటించారు.
ఓ ప్రభుత్వాధికారిగా పనిచేస్తూ, ఈవిదంగా రాజకీయాలు చేస్తుండటంపై సిఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ముగ్గురిలో ఎవరూ స్పందించకపోవడం గమనిస్తే ఆయనకు టికెట్ ఇస్తానని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారనుకోవాలా? లేక టికెట్ ఇవ్వకపోయినా పదవికి రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేయాలని సిద్దపడి ఈవిదంగా చేస్తున్నారనుకోవాలా?