ఈ 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధి గురించి ఎవరో చెప్పక్కరలేదు. ఎక్కడికక్కడ కళ్లెదుటే కనబడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక ఐటి రంగాలలో జరిగిన అభివృద్ధితో లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుండగా, ఆయా ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు నిదర్శనంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఏర్పాటు చేసిన అపారెల్ పార్కు... దానిలో పరిశ్రమల గురించి చెప్పుకోవచ్చు. అక్కడ ఏర్పాటైన అనేక పరిశ్రమలలో ‘గ్రీన్ నీడిల్’ కూడా ఒకటి. దానిలో తయారైన మొట్టమొదటి బ్యాచ్ బాక్సర్ (నిక్కర్లు) కూడిన కంటెయినర్స్ శుక్రవారం కంపెనీ నుంచి ముంబైకి బయలుదేరాయి.
అక్కడి నుంచి న్యూయార్క్ నగరంలోని ‘గాప్ ఆర్గానిక్ కాటన్ బాక్సర్స్’కు నౌకలో ఎగుమతి చేయబడతాయి. ఇంతకాలం విదేశాలలో తయారైన దుస్తులను భారత్ దిగుమతి చేసుకొంటుండగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన దుస్తులు అమెరికాకు ఎగుమతి చేస్తే స్థాయికి ఎదిగడం మన అందరికీ గర్వకారణమే కదా.
సిరిసిల్ల జిల్లాలో 60 ఎకరాల విస్తీర్ణంలో అపెరల్ పార్క్ ఏర్పాటైంది. దేశంలో రెడీమేడ్ దుస్తులు తయారీలో అగ్రగామిగా నిలుస్తున్న ‘గోకుల్ దాస్ ఇమేజెస్’ మొట్టమొదటగా పరిశ్రమను ఏర్పాటు చేసి చాలా కాలం క్రితమే ఉత్పత్తి కూడా ప్రారంభించింది. ఇపుడు గ్రీన్ నీడిల్ కూడా ఉత్పత్తి ప్రారంభించి అమెరికాకు ఎగుమతులు మొదలుపెట్టింది.
ఈ అపారెల్ పార్కులో ఏర్పాటయిన దుస్తుల కంపెనీలలో సుమారు 10 వేలమంది ఉద్యోగాలు పొందారు. వారిలో 80 శాతం మంది మహిళలే. అందరూ స్థానికులే. ఇదివరకు బీడీ కార్మికులుగా దయనీయ జీవితాలు గడుపున్న వీరందరికీ దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చి ఈ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడంతో వారి జీవితాలలో మళ్ళీ వెలుగులు వచ్చాయి.