హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున నిన్న హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తన భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పగానే మంత్రి కేటీఆర్ వెంటనే డిజిపి అంజని కుమార్‌కు ఫోన్ చేసి, ఈటల రాజేందర్ భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అయితే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డే తన భర్తను హత్య చేయించాలని కుట్ర పన్నుతున్నారని ఆమె చేసిన ఆరోపణల గురించి మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం గమనార్హం. అతను అధికార పార్టీకే చెందినవారు కనుక బహుశః పార్టీ పరంగా విచారణ జరుపుతున్నామని సర్ధిచెప్పుకోవచ్చు.
సొంత పార్టీ ఎమ్మెల్యేల ఆగడాల గురించి మహిళలు ఎన్ని పిర్యాదులు వస్తున్నా పట్టించుకోని మంత్రి కేటీఆర్, తమ బద్ధ శత్రువైన ఈటల రాజేందర్ భద్రత గురించి ఎందుకు వెంటనే స్పందించారు?అనే సందేహం కలగడం సహజం.
ఇటీవల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి, ఈటల రాజేందర్‌కి పడటంలేదని, కనుక ఆయన పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఆయన పార్టీ మారదలచుకొంటే కాంగ్రెస్ పార్టీలోనే చేరవచ్చు.
ఇప్పటికే రాష్ట్రంలో బిఆర్ఎస్ వ్యతిరేకశక్తులన్నీ కాంగ్రెస్ పార్టీలో ఏకం అవుతున్నాయి. కనుక ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్‌లో చేరితే ఆ పార్టీ మరింత బలపడుతుంది. కనుక ఆయనను కాంగ్రెస్‌లో చేరకుండా అడ్డుకొని మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోకి రప్పించేందుకే కేసీఆర్ ఆయనకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారేమో?అనే సందేహం కలుగుతోంది.
రాజకీయాలలో శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు ఉండరు. కనుక ఈటల రాజేందర్ మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినా వెళ్లవచ్చు. కేసీఆర్‌ని తిట్టిన నోటితోనే పొగిడినా పొగడవచ్చు. ఇది ఊహాగానామే కావచ్చు కానీ ఇది నిజమవుతుందో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.