జనగామ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు ఎప్పుడూ ఏదో వివాదాలలో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన సొంత కూతురు తూల్జా భవానీ ఆయన భూకబ్జా చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింద ఉన్న 1200 గజాల ప్రభుత్వ స్థలాన్ని తన తండ్రి కబ్జా చేసి తన పేరు మీద రిజిస్టర్ చేయించారని తూల్జా భవానీ నిన్న మీడియాకు తెలిపారు. తన తండ్రి ఎన్నికలలో పోటీ చేయకమునుపే సుమారు వెయ్యి కోట్లు ఆస్తులున్నాయని, అయినా ఈవిదంగా చేయడం తనకు నచ్చలేదన్నారు. కనుక తన తండ్రి కబ్జా చేసిన స్థలం చుట్టూ నిర్మించిన ప్రహారీగోడను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తూ జేసీబీతో కూల్చివేయించారు. అనంతరం అక్కడ “తన తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఊరిభూమిని కబ్జా చేసినందుకు ఆయన తరపున ఊరి ప్రజలను నేను క్షమాపణ కోరుతున్నాను,” అంటూ ఓ బోర్డు కూడా పెట్టించారు. ఆ స్థలాన్ని మునిసిపాలిటీకి తిరిగి అప్పగించేస్తానని ఆమె చెప్పారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూకబ్జాలు చేస్తుండటం, తాటికొండ రాజయ్య, దుర్గం చిన్నయ్య తదితరులు మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ నేతలు, బంధువులే స్వయంగా ఆరోపిస్తున్నప్పటికీ కేసీఆర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వారిని సమర్ధిస్తున్నారని ప్రజలు భావించరా?