నేడు భోపాల్ జరిగిన పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ, దేశ ప్రజలందరికీ ఒకే రకమైన చట్టం, న్యాయం అమలుచేయాల్సిన అవసరం ఉందని చెప్పడంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దానికి కారణం, దేశంలో ముస్లింలు తమ షరియత్ చట్టాలనే పాటిస్తుంటారు. వాటికే కట్టుబడి జీవిస్తుంటారు.
కానీ అనేక సందర్భాలలో వారిమద్య లేదా వారితో ఇతర మతస్థులకు న్యాయ వివాదాలు ఏర్పడినప్పుడు, న్యాయస్థానాలు భారత రాజ్యాంగం ప్రకారమే తీర్పులు చెపుతుంటాయి. కనుక దేశంలో రెండు రకాలైన చట్టాలు కాకుండా కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ ఒకే రకమైన న్యాయవ్యవస్థ, చట్టాలు ఏర్పాటు చేయడమే ఉమ్మడి పౌర స్మృతి.
అయితే మజ్లీస్ ఎంపీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అప్పుడే దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దేశంలో ఒకే జాతి, ఒకే రేషన్ కార్డ్ ఉండాలని వాదిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు ఒకే చట్టం ఉండాలని వితండవడం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ముస్లింల హక్కులుమ, అధికారాలను హరించివేసి వారిని నిర్వీర్యం చేసేందుకే ప్రధాని నరేంద్రమోడీ ఈ పేరుతో హిందూ చట్టాలను చేయాలని యోచిస్తున్నారు. మోడీ హిందూ ఓటు బ్యాంక్ కోసమే హటాత్తుగా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ప్రతిపాదన గురించి మాట్లాడుతున్నారని,” అసదుద్దీన్ ఓవైసీ ఆక్షేపించారు.
నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని విపక్ష పార్టీలు దీని గురించి మాట్లాడటం మొదలుపెడతాయి. అవన్నీ ఈ ప్రతిపాదనను ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తే బిజెపి హిందూ ఓటు బ్యాంక్ అంతగా పెరుగుతుంది. బలపడుతుంది. అంతిమంగా లోక్‌సభ ఎన్నికలలో దేశవ్యాప్తంగా హిందువులను ఒక్కటిగా చేసి వారి ఓట్లను పొందగలిగితే బిజెపి మళ్ళీ కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి రాగలదు.
ఉదాహరణకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఇలాగే బిజెపి, మజ్లీస్, బిఆర్ఎస్ మూడు కత్తులు దూసుకొన్నట్లు నటించి ఎవరి ఓట్లు అవి సంపాదించుకొన్న సంగతి బహుశః హైదరాబాద్ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదేవిదంగా ఈ అంశంతో దేశవ్యాప్తంగా హిందూ ఓట్లు పార్టీల మద్య చీలకుండా చేయగలిగితే లబ్ధి పొందేదీ బిజెపియే అని వేరే చెప్పక్కరలేదు.