తెలంగాణ సిఎం కేసీఆర్ 600 కార్లు వేసుకొని మహారాష్ట్రలో రెండు రోజులు పర్యటించి బలప్రదర్శన చేయడంపై శివసేన పార్టీ తొలిసారిగా స్పందించింది. ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రలో తిరుగుతున్నారు.
అయినా 600 కార్లు వేసుకొని వచ్చి ఇక్కడ బలప్రదర్శన చేయవలసిన అవసరం ఏముంది? ఆయన ఇక్కడ మహారాష్ట్రలో ఇలాగే డ్రామాలు ఆడుతుంటే అక్కడ తెలంగాణలో నిజంగానే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయం. మహారాష్ట్ర రాజకీయాలలో బిఆర్ఎస్‌కు చోటు లేదు. అది ఇక్కడ ఎటువంటి ప్రభావమూ చూపలేదు.
కేసీఆర్ ఇక్కడ ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అక్కడ తెలంగాణలో అంతగా
బలహీనపడటం ఖాయం. కేసీఆర్ బిజెపికి బీటీం అని అందరికీ తెలుసు. ఇదివరకు హైదరాబాద్
నుంచి మజ్లీస్ పార్టీని బిజెపి ఇక్కడకు పంపింది. ఇప్పుడు ఆయనను పంపిస్తోంది. ఓ
ఉద్యమనేత అయిన కేసీఆర్ బిజెపికి ఎందుకు ఇంతగా భయపడుతున్నారో అర్దం కాదు,” అని అన్నారు.
మహారాష్ట్రకే
చెందిన కాంగ్రెస్ నేత, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే కూడా ఇంచుమించు ఇదేవిదంగా
ఆరోపిస్తూ, “కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకొంటూ బిజెపికి
సాయపడాలనుకొంటున్నారు. కర్ణాటకలో అదే చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో అదే చేసేందుకు వస్తున్నారు.
అయితే ఆయన రాజకీయాలు ఇక్కడ చెల్లవు,” అని అన్నారు.