బిఆర్ఎస్ పార్టీకి మజ్లీస్ తలాక్ చెప్పబోతోందా?ఓవైసీలు కేసీఆర్‌తో దోస్తీ ఇక చాలనుకొంటున్నారా?అంటే అసదుద్దీన్ ఓవైసీ మాటలు వింటే అవుననే అనిపిస్తుంది. భోధన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదు మేరకు స్థానిక మజ్లీస్ నేతలపై పోలీసు కేసులు పెట్టి జైలుకి పంపారు.
ఈరోజు వారిని జైల్లో పరామర్శించడానికి వచ్చిన మజ్లీస్ ఎంపీ, అధినేత అసదుద్దీన్ ఓవైసీ బయటకు వచ్చాక విలేఖరులతో మాట్లాడుతూ, “కల్వకుంట్ల కవిత, షకీల్ గెలుపుకోసం మావాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ షకీల్ వాళ్ళనే జైలుకి పంపారు. వచ్చే ఎన్నికలలో భోధన్ నుంచి మజ్లీస్ పార్టీ పోటీ చేస్తుంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌ని ఓడిస్తుంది. ఈసారి రాష్ట్రంలో మాకు బలం ఉన్న అన్ని స్థానాలలో తప్పకుండా పోటీ చేస్తాం.
మేము ఎవరి కోసమో త్యాగాలు చేస్తూ ఎప్పటికీ పాతబస్తీకి పరిమితమై ఉండిపోవాల్సిన అవసరం లేదు. కనుక మేము కూడా బిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు గట్టిగా కృషి చేస్తాం. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో త్వరలోనే ప్రకటిస్తాం,” అని ఓవైసీ అన్నారు.
మజ్లీస్ పార్టీలో ఈ మార్పుకి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. కర్ణాటకలో ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపడం. 2. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతానని హామీలు ఇచ్చిన కేసీఆర్ మళ్ళీ బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుండటం.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొంటోంది. కనుక తెలంగాణలో ముస్లింలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారిప్పుడు. బహుశః అందుకే ఓవైసీ ఈవిదంగా మాట్లాడి ఉండవచ్చు.
మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతానని చెప్పిన కేసీఆర్, పాట్నాలో జరిగిన బిజెపియేతర పార్టీల సమావేశానికి హాజరుకాలేదు. అదే సమయంలో తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ను ఢిల్లీ పంపించారు. ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. తద్వారా బిజెపికి మళ్ళీ దగ్గరవుతున్నామనే సంకేతాలు పంపించిన్నట్లయింది. కనుక మజ్లీస్ కూడా కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపబోతున్నట్లు భావించవచ్చు.