గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారంటూ వార్తలు వస్తున్నాయి. వాటిపై ఆమె స్పందిస్తూ, తాను ఇక్కడే తెలంగాణ బిడ్డగా తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటానని ట్వీట్ చేశారు. ఊహాజనితమైన కధలు కల్పిస్తూ తనకు తెలంగాణ ప్రజలకు మద్య అగాధం సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సిఎం కేసీఆర్‌కు హితవు పలికారు. పనిలేని, పసలేని దార్శనికులు నా రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించే బదులు పాలనపై పెడితే బాగుంటుందని వ్యంగ్యంగా అన్నారు.
ఇదివరకు మీడియా సమావేశంలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఇక విలీనం ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెప్పారు. అయితే ఈసారి ఆమె అలా చెప్పలేదు కానీ ఏపీకి వెళ్ళడం లేదని మాత్రమే చెప్పారు. ఇక్కడే తెలంగాణలోనే రాజకీయాలు చేస్తానని స్పష్టం చేశారు.
అయితే “కాంగ్రెస్ పార్టీలో నేను ఉండగా వైఎస్ షర్మిలకు స్థానం లేదని, కానీ ఆమె ఏపీ కాంగ్రెస్‌లోకి వెళితే తప్పకుండా సహకరిస్తానని” పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదివరకే కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పారు.
ఒకవేళ ఆమె పార్టీని విలీనం చేసుకొని ఆమెను పార్టీలో చేర్చుకొంటే, ‘నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుని కనుక నేను కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హురాలనినంటూ’ పోటీ పడటం ఖాయం. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికే రేవంత్ రెడ్డితో సహా ఓ అరడజను మంది సీనియర్ నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. కనుక ఆమె తెలంగాణలోనే రాజకీయాలు చేయాలనుకొంటే ఆమె కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోగలరేమో కానీ విలీనం చేయడానికి కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరించకపోవచ్చు.
ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తులు కూడా వద్దనుకొంటే ఎప్పటిలాగే ఆమె తండ్రి పేరు చెప్పుకొంటూ కాళ్ళు అరిగిపోపోయేలా పాదయాత్రలు చేస్తూ కాలక్షేపం చేసుకోలసిందే.