దటీజ్ కేసీఆర్‌!

June 22, 2023


img

కేసీఆర్‌లోని కర్కశమైన రాజకీయ నాయకుడు ఉన్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజల పట్ల అవ్యాజ్యమైన ప్రేమ గౌరవం చూపే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి కూడా ఉన్నాడు. ఇందుకు తాజా ఉదాహరణగా ఈరోజూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగిన సభలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలను సభాముఖంగా ప్రశంషించడం గురించి చెప్పుకోవచ్చు.  

“మీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎప్పుడూ నా వెంటపడుతూనే ఉంటాడు. ఓసారి హాస్పిటల్‌ కావాలని పట్టుబట్టి సంతకం చేయించుకొంటాడు. ఇప్పుడు రెవెన్యూ డివిజన్‌ కావాలంటున్నాడు. తప్పదు కదా... త్వరలోనే మంజూరు చేస్తాను. మీ అందరి కోసం ఇంతగా ఆలోచిస్తున్న మహిపాల్ రెడ్డిని వచ్చే ఎన్నికలలో మీరందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను,” అంటూ వేదికపై నుంచి టికెట్‌ ఖరారు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన అనుచరులు సంతోషంతో హర్షధ్వానాలు చేశారు.  

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న రాజీవ్ శర్మ, కాలుష్య నియంత్రణ బోర్డు బాధ్యతలు కూడా అప్పగించానని కేసీఆర్‌ చెప్పారు. “మీ అందరికీ తెలియకపోవచ్చునేమో కానీ ఆయన అనేకసార్లు పటాన్‌చెరులో పర్యటించి కాలుష్య నియంత్రణకు ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయించారు. ఈరోజు ప్రారంభిస్తున్న ఈ హాస్పిటల్‌ కూడా ఆయనే పట్టుబట్టి కట్టిస్తున్నారు. ఈ క్రెడిట్ పూర్తిగా ఆయనదే,” అంటూ సభాముఖంగా రాజీవ్ శర్మని సిఎం కేసీఆర్‌ ప్రశంశించారు. 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు గురించి మాట్లాడుతూ, “మీ అందరికీ తెలుసు... హరీష్ రావు ఏదైనా పని మొదలుపెడితే పూర్తి చేయకుండా వదిలిపెట్టరని. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పగిస్తే అందరినీ పరుగులు పెట్టించి మూడేళ్ళలో పూర్తి చేయించారు. వైద్య ఆరోగ్యశాఖ అప్పగిస్తే అన్ని జిల్లాలలో ప్రభుత్వాసుపత్రులు, వైద్యకళాలలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మింపజేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలోనే ఐదు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ నిర్మింపజేయిస్తున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బంది పడ్డామని భావించి పెద్ద ఆక్సిజన్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయించారు,” అంటూ హరీష్ రావుని కేసీఆర్‌ ప్రశంశించారు.


Related Post