స్టేషన్‌ఘన్‌పూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై జానకీపురం సర్పంచ్ నవ్య మళ్ళీ ఆరోపణలు చేశారు. అధిష్టానం ఆదేశం మేరకు మూడు నెలల క్రితం ఆయన తన ఇంటికి వచ్చి రాజీకి ప్రయత్నించారని, ఆరోజు మీడియా ఎదుట అన్ని నీతులు మాట్లాడిన రాజయ్య మళ్ళీ తనను వేధిస్తున్నాడని ఆరోయించారు.
తనతో ఆయన అసభ్యంగా మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన ఫోన్ సంభాషణలను పూర్తిగా చెరిపేసి, చెరిపేసినట్లు సాక్ష్యం చూపాలని రాజయ్య తన అనుచరులతో ఒత్తిడి చేస్తున్నారని సర్పంచ్ నవ్య ఆరోపించారు. అయితే తన వద్ద ఎటువంటి రికార్డులు లేవని చెపుతున్నప్పటికీ రాజయ్య తమను వేధిస్తుండటంతో తన భర్త ప్రవీణ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయబోతే వారు ఎమ్మెల్యే రాజయ్యకు భయపడి ఫిర్యాదు స్వీకరించడం లేదని నవ్య ఆవేదన వ్యక్తం చేశారు.
రాజయ్య ఎంతకూ తెగించారంటే తనకూ, తన భర్తకు మద్య చిచ్చుపెట్టి తమని విడదీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజయ్య తీరు మారకుంటే మళ్ళీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
అయితే రాజయ్య ఎప్పటిలాగే, పార్టీలో కొందరు వ్యక్తులు తనను రాజకీయంగా ఎదుర్కొలేకనే నవ్యను అడ్డుపెట్టుకొని తనపై లైంగిక ఆరోపణలు చేస్తూ తనపై బురద జల్లెందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ వచ్చే ఎన్నికలలో మళ్ళీ తనకే కేసీఆర్ సీటు ఇస్తారని, మళ్ళీ తానే విజయం సాధిస్తానని రాజయ్య అన్నారు.
కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచిపేరు తెచ్చుకొంటుంటే, రాజయ్యవంటి వారి వలన పార్టీ ప్రతిష్ట మసకబారుతుంది. ఓ మహిళా సర్పంచ్‌తో రాజయ్య ఈవిదంగా వ్యవహరిస్తుంటే, పార్టీ అధిష్టానం స్పందించకపోవడం, మౌనంగా ఉండిపోవడం, మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వాలనుకోవడం ఆయనను సమర్ధిస్తున్నట్లే ఉంది. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. ప్రతిపక్షాలకు బిఆర్ఎస్‌ని వేలెత్తి చూపేందుకు అవకాశం కల్పిస్తుంది కదా?