ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీగా కలక్షన్స్ రాబడుతోంది. అయితే ఆదిపురుష్ సినిమాపై నేటికీ ఎన్నెన్నో విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. బహుశః ప్రభాస్ అభిమానులు కూడా ఆదిపురుష్ సినిమాని జీర్ణించుకోవడం కష్టమే. కనుక వారు అప్పుడే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సిద్దమవుతున్న ‘సలార్’, మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజా డీలక్స్’ సినిమాల కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు.
నిజానికి ఆదిపురుష్ సినిమాకు ముందే సలార్ టీజర్ విడుదల చేయాలనుకొన్నారు. ఆ తర్వాత ఆదిపురుష్ థియేటర్లలోనే టీజర్ విడుదల చేస్తే ఒకదాని వలన మరో సినిమాకి లాభం కలుగుతుందనుకొన్నారని ఊహాగానాలు వినిపించాయి.అవి నిజమో కాదో తెలీదు కానీ వారి లెక్కలు మాత్రం సరైనవే అని చెప్పొచ్చు.
ఒకవేళ ఆదిపురుష్ ప్రదర్శిస్తున్న థియేటర్లలో సలార్ టీజర్ విడుదల చేసి ఉండి ఉంటే, ఈ ఊపులో దానికీ మంచి ప్రచారం లభించి ఉండేది. ఆ టీజర్ ఉందని తెలిస్తే ఆదిపురుష్ చూసేందుకు మరింత ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చి కలక్షన్స్ పెరిగి ఉండేవి. కానీ సలార్ దర్శక నిర్మాతలు టీజర్ విడుదల చేయలేకపోయారు. తద్వారా సలార్‌కు మంచి పబ్లిసిటీ మిస్ చేసుకొన్నారు.
రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంభోలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. జగపతి బాబు, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, పృధ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. దీనిని 2023, సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు హోంభలే ఫిల్మ్స్ ట్విట్టర్‌లో ప్రకటించింది.
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్‌రూర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
ఆదిపురుష్ హడావుడి అయిపోయింది కనుక ప్రబాస్ ఇప్పుడు సలార్, రాజా డీలక్స్, ఇంకా నాగ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె పూర్తిచేయడంపై దృష్టి పెట్టనున్నారు. వీటి తర్వాత ప్రభాస్ మళ్ళీ మరో పౌరాణిక సినిమాలో నటించబోతున్నాడని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.