తెలంగాణ రాజకీయాలలో ధరణి పోర్టల్ ఎన్నికల అంశంగా మారడటం చాలా గమ్మత్తుగా ఉంది. దాని వలన సామాన్య రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, పేదల భూములను బిఆర్ఎస్ నేతలు కాజేసేందుకు మాత్రమే ధరణి పోర్టల్ ఉపయోగపడుతోందని, కనుక రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ధరణీ పోర్టల్ రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు గట్టిగా చెపుతున్నారు.
రాష్ట్ర బిజెపి నేతలు కూడా మొదట అదే విదంగా వాదించారు. అయితే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హటాత్తుగా యూటర్న్ తీసుకొని, తాము అధికారంలోకి వస్తే ధరణీలో లోపాలను సవరించి దానిని కొనసాగిస్తామని ప్రకటించారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలన్నిటినీ కూడా యధాతధంగా కొనసాగిస్తామని ప్రకటించారు. బిజెపి మోర్చా అధ్యక్షుల సమావేశంలో బండి సంజయ్ ఈ ప్రకటన చేశారు.
కొన్ని రోజుల క్రితం వరకు కూడా బండి సంజయ్ ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబం, బిఆర్ఎస్ నేతలు ఆస్తులు పెంచుకోవడం కోసమే ఏర్పాటు చేయబడిందని కనుక దానిని రద్దు చేసి తీరాలని వాదించారు. అలాగే సంక్షేమ పధకాలన్నీ బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జేబులు నింపుకోవడానికే ఉపయోగపడుతున్నాయని విమర్శించారు. కానీ ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే ధరణీని, సంక్షేమ పధకాలను కూడా కొనసాగిస్తామని బండి సంజయ్ మాట మార్చడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
బహుశః కాంగ్రెస్ పార్టీ బాటలో తాము సాగడం వలన నష్టపోతామనే ఆలోచనతో బండి సంజయ్ యూటర్న్ తీసుకొని ఉండవచ్చు. అయితే వాటిని కొనసాగిస్తామని చెప్పడం ద్వారా, కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ధరణి, అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు రెండూ కూడా సరైనవే అని బండి సంజయ్ ధృవీకరించిన్నట్లే కదా?
ఇదివరకు కేసీఆరే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో బిజెపి బలపడటంతో బిజెపిని రాజకీయంగా దెబ్బ తీయడం కోసమే కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి మళ్ళీ పైకిలేపేందుకు ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కూడా బిజెపిని ఓడించేందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా డబ్బు మూటలు అందించారని బండి సంజయ్ ఆరోపించారు. అయితే కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసిన వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిజెపి గెలుపుని ఎవరూ ఆపలేరని బండి సంజయ్ అన్నారు.