ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బిజెపి చాలా తహతహలాడుతోంది. అయితే కల నెరవేర్చుకోవడానికి తెలంగాణ బిజెపిలో బలమైన అభ్యర్ధులే లేరు. పైగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడంతో తెలంగాణ కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొంది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపినందుకు మెజారిటీ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకే మొగ్గుచూపుతారనేది అందరికీ తెలుసు.
కనుక వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ను ఢీకొని గెలవాలంటే రాష్ట్ర ప్రజలందరూ ప్రసన్నం అయ్యే ఏదైనా ఓ గొప్ప పని చేయాల్సి ఉంటుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణకు కొన్ని నిధులు, కొన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చినా, ప్రజలు వాటిని పట్టించుకోకపోవచ్చు.
కనుక ఎవరూ ఊహించలేనిదేదో ఆఫర్ చేయాలి. అదే... దేశానికి హైదరాబాద్‌ని రెండో రాజధానిగా ప్రకటించడం. డా.అంబేడ్కర్ స్వయంగా ఈ ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఈ ప్రతిపాదన వినిపించింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు మళ్ళీ మరోమారు వినిపించింది. అయితే ఈసారి బిజెపి సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు నోటి నుంచి వినిపించడమే ఆలోచింపజేస్తోంది.
చాలా రోజుల తర్వాత ఆయన ఇవాళ్ళ మీడియాతో మాట్లాడుతూ, “ఢిల్లీ నగరం నానాటికీ వాయుకాలుష్యం పెరిగిపోతోంది కనుక డా.అంబేడ్కర్ సూచించిన్నట్లు హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేసేందుకు అవకాశం ఉంది,” అని అన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు బిజెపి ఈ హామీ ఇచ్చి ఓట్లు అడగబోతోందా?అనే సందేహం కలుగుతోంది.
ఒకవేళ ఈ హామీ ఇస్తే తెలంగాణ ప్రజలు గంపగుత్తగా బిజెపికే ఓట్లు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా మారితే, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయి. కనుక ఈ హామీతో బిజెపి తెలంగాణ ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని అనుకొంటోందా?అనే సందేహం కలుగుతోంది.
లేకుంటే విద్యాసాగర్ రావు హటాత్తుగా మీడియా ముందుకు వచ్చి వేరే విషయాలు మాట్లాడకుండా హైదరాబాద్ దేశ రెండో రాజధాని ప్రతిపాదన గురించి ఎందుకు ప్రస్తావించిన్నట్లు? కేంద్ర ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఉంది కనుకనే అని భావించవచ్చు. ఈ ఊహ నిజమో కాదో తెలీదు కానీ నిజమైతే బాగుంటుంది.