మోడీ, షా పర్యటనలకు ముందు ఐ‌టి రెయిడ్స్... తప్పనిసరా?

June 14, 2023


img

ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నా వారి కంటే ముందు సీబీఐ, ఈడీ, ఐ‌టి బృందాలు రాష్ట్రానికి చేరుకొని దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తుంటాయని సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు పదేపదే ఆరోపిస్తుంటారు. వారి ఆరోపణలు నిజమని నిరూపిస్తున్నట్లు ఈరోజు ఉదయం నుంచి భువనగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలలో ఐ‌టి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. రేపు ఆయన భద్రాచలంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేసిన తర్వాత ఖమ్మంలో బిజెపి అధ్వర్యంలో జరిగే బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. ఎప్పటిలాగే కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసి బిజెపికి ఓట్లేయమని అభ్యర్ధిస్తారు. ఈ సభలో ఇతర పార్టీలకు కొంతమంది నేతలకు అమిత్‌ షా కండువాలు కప్పి బిజెపిలో చేర్చుకోవచ్చని తెలుస్తోంది. 

తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసుకొనేందుకు రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలని నయాన్నో, భయాన్నో నచ్చజెప్పి బిజెపిలో చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక బిఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు ఈ ఐ‌టి దాడులు బహుశః అందుకే కావచ్చు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఇకపై మోడీ, అమిత్‌ షాలు తరచూ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడం ఖాయం. కనుక తెలంగాణలో మరిన్ని ఐ‌టి దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది.  

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కలిసి బిజెపిలో చేరాల్సిందిగా నచ్చజెప్పారు. కానీ వారు అంగీకరించలేదని చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌ స్వయంగా చెప్పారు. వారిరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతునట్లు సమాచారం. కనుక నేడో రేపో ఐ‌టి అధికారులు వారినీ పలకరించినా ఆశ్చర్యం లేదు.


Related Post