తెలంగాణను పేపర్ల మీద కాకుండా కళ్ళకు కనబడేలా అభివృద్ధి చేసి చూపించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్‌దే. సాగు, త్రాగునీరు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, మౌలిక వసతుల కల్పన, విద్యా, వైద్య, పర్యాటకం, పర్యావరణం ఇలా ఏ రంగంలో చూసినా కేసీఆర్ మార్క్ అభివృద్ధి కనిపిస్తుంటుంది.
కనుక తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురే ఉండకూడదు గదా?కానీ కాంగ్రెస్, బిజెపి, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో సహా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసమితి, ప్రజాశాంతి వంటి మరో అరడజను పార్టీలు తెలంగాణలోనే ‘రాజకీయ అవకాశం ఉందని’ ఎందుకు భావిస్తున్నాయి?
కేసీఆర్‌ని ఓడించి అధికారంలోకి రాగలమని ఎందుకు నమ్ముతున్నాయి? అని ఆలోచిస్తే అభివృద్ధి పేరుతో కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడుతూ అక్రమస్తులు పోగేసుకొంటున్నారని, కుటుంబ పాలన, నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను తొక్కేస్తున్నారని కనుక కేసీఆర్ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ప్రతిపక్షాల వాదన.
అయితే కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలలో అవినీతి లేదా అక్రమాలు జరగడం లేదా?జరుగుతూనే ఉంటాయని అందరికీ తెలుసు. ఆ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అన్ని విధాలా మెరుగుగా ఉంది. ఆ క్రెడిట్ కేసీఆర్‌దే కనుక ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఎందుకు వ్యతిరేకించాలి?అని ఆలోచిస్తే అవసరమే లేదనిపిస్తుంది.
కానీ రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం అవుతూ, తమ వాదనలతో ప్రజలను ప్రభావితం చేయగలవు కనుక ఇంతవరకు ప్రజలు కేసీఆర్‌ని చూసి ఏవిధంగా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసేవారో, ఇప్పుడూ అదేవిదంగా కేసీఆర్‌ని చూసే బిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లేసే అవకాశం ఉంటుంది.
కేసీఆర్ పాలన ఏవిదంగా ఉంటుందో ప్రజలు చూశారు. రెండుసార్లు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చాము కనుక ఇప్పుడు మరో పార్టీకి ఇవ్వాలనుకోవడం సహజం. ఒకవేళ ప్రజలు మార్పు కోరుకొంటున్నట్లయితే కాంగ్రెస్, బిజెపిలే ప్రధానంగా కనిపిస్తున్నాయి కనుక వాటిలో దేనివైపు మొగ్గు చూపవచ్చు?అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే అని చెప్పొచ్చు.
ఎందుకంటే బిజెపికి అధికారం కట్టబెడితే అది అభివృద్ధి కంటే మతరాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. అందుకే ఇతర పార్టీల నేతలెవరూ బిజెపిలో చేరేందుకు ఇష్టపడటం లేదు. కానీ కాంగ్రెస్ మతం కంటే ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అలాగని కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ అభివృద్ధికి గ్యారెంటీ ఇవ్వలేదని అందరికీ తెలుసు.
ఆ పార్టీ అధికారంలో లేనప్పుడే పదవుల కోసం నేతలు కీచులాడుకొంటుంటారు. అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు అదే పనిలో ఉంటారని కూడా అందరికీ తెలుసు. కాంగ్రెస్ పాలనకు అవినీతికి విడదీయరాని బంధం ఉంటుంది. కనుక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడే అవకాశం కోడా ఉంటుంది.
అయితే పదేళ్ళ కేసీఆర్ పాలన చూసిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటే, తెలంగాణ ఏర్పాటు చేసినందుకు ఓసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండనే కాంగ్రెస్ నేతల అభ్యర్ధనలు వారి మనసులను కరిగించవచ్చు. బిజెపితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు చిరపరిచుతులైన అనేక మంది నాయకులున్నారు. కనుక ఒకవేళ తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని వద్దనుకొంటే, కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపవచ్చు. ప్రజలు మార్పు కోరుకొంటున్నారని పసిగట్టిన నేతలు, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని భావిస్తూన్నారు కనుకనే ఆ పార్టీలో చేరుతున్నారని చెప్పవచ్చు.
కనుక కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేసినప్పటికీ ఈసారి ఎన్నికల వ్యూహాలతోనే గట్టెక్కవలసిరావచ్చు. అందుకే కేసీఆర్ అప్పుడే తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు, కొత్తకొత్త పధకాలు ప్రారంభించేశారు కూడా.