ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరులోగా దాని షూటింగ్ పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. అది పూర్తవగానే రాజమౌళితో సినిమా మొదలుపెడతారు. ఆర్ఆర్ఆర్ హంగామా ముగిసింది కనుక రాజమౌళి టీమ్ ఇప్పుడు ఈ కొత్త సినిమా పనులు మొదలుపెట్టారు.
మహేష్ బాబు ఖాళీ అయితే ఈ ఏడాది అక్టోబర్ తర్వాత ఆరు నెలల పాటు వర్క్ షాపులో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు.
ఈ సినిమాను సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఓ అంతర్జాతీయస్థాయి అడ్వంచర్ మూవీగా తీయాలని రాజమౌళి, మహేష్ బాబు ఇప్పటికే నిర్ణయించుకొన్నారు.
సాధారణంగా రాజమౌళి ఓ సినిమా పూర్తిచేసేందుకు కనీసం 2-3 ఏళ్ళు సమయం తీసుకొంటారు. దీనిని అంతర్జాతీయ స్థాయిలో సుమారు రూ.1,500 కోట్ల భారీ బడ్జెట్‌లో తీయబోతున్నట్లు తాజా సమాచారం. అయితే అనేక దేశాలలో సాగే ఈ సినిమా కధ విస్తృతిని దృష్టిలో ఉంచుకొని దీనిని కూడా రెండు లేదా మూడు భాగాలుగా తీయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తాజా సమాచారం.
ఒకవేళ ఇదే నిజమైతే, కేవలం రెండేళ్ళలోనే ఒక్కో భాగం పూర్తిచేయగలరనుకొన్నా మరో 5-6 ఏళ్ళ వరకు మహేష్ బాబు మరో సినిమా చేయలేరు. అయితే రాజమౌళి అంతకంటే ఎక్కువ సమయమే తీసుకొంటారు తప్ప ముందుగా ముగించలేరని వేరే చెప్పక్కరలేదు. ఆ సినిమాలు కూడా తప్పకుండా సూపర్ హిట్ అవ్వొచ్చు. వాటికీ ఆస్కార్ వచ్చినా రావచ్చు .
కానీ మరో 5-6 ఏళ్ళు మహేష్ బాబు మరో సినిమా చేయలేరంటే అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. ఈ గ్యాప్‌లో మిగిలిన హీరోలు లేదా కొత్త హీరోలు హాయిగా సినిమాలు చేసుకొంటూ నంబర్:1 స్థానంలో నిలుస్తుంటే, మహేష్ బాబు టాలీవుడ్‌లో ఉన్నప్పటికీ దానికి దూరంగా వేరే ప్రపంచంలో ఉండిపోతారు.
ప్రస్తుతం మహేష్ బాబు వయసు 48 ఏళ్ళు. వచ్చే ఏడాది రాజమౌళితో సినిమా మొదలుపెట్టి వాటిని పూర్తిచేసి బయటకు వచ్చేసరికి 53-55 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇది కూడా మహేష్ బాబు అభిమానులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
బాహుబలితో 4-5 ఏళ్ళు లాక్ అయిపోయిన ప్రభాస్, ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడంతో అదీ... ఆయనకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు ఆయన చిన్న సినిమాలు చేయలేని పరిస్థితి ఓవైపు, దాంతో ప్రతీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తీయవలసి వస్తుండటం, ఒక్కో దానికి 2-3 ఏళ్ళు సమయం తీసుకొంటుండటం, ప్రతీ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడుతుండటం వంటివి డ్రా-బ్యాక్స్ అనే భావించవచ్చు.
అందుకే ఇకపై ఏడాదికి కనీసం రెండు లేదా మూడు సినిమాలు చేస్తానని ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించారు. రాజమౌళి సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మహేష్ బాబు పరిస్థితి కూడా ఇదేవిదంగా ఉండవచ్చు.