ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులే!

June 07, 2023


img

దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా నేడు తెలంగాణ ప్రభుత్వం అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుపుతోంది. ఒకప్పుడు ఉద్యోగాలు అంటే ప్రభుత్వోద్యోగాలు మాత్రమే అనే భావన ప్రజలలో బలంగా ఉండేది. నేటికీ ప్రతిపక్షాలు అదే భావనతో ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. కానీ ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ కూడా దేశంలో ప్రజలందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించలేదని అందరికీ తెలుసు. అందుకే పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలను ప్రోత్సహిస్తుంటాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది.

బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికాభివృద్ధికి అవరోధంగా ఉన్న నిబందనలను, ఆంక్షలను గుర్తించి రద్దు చేసి నూతన పారిశ్రామిక విధానం, నూతన ఐ‌టి పాలసీలు ప్రకటించి అమలుచేస్తోంది. మళ్ళీ వాటిలో వివిద రకాల పరిశ్రమలకు వేర్వేరుగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తూ, వాటికే ప్రత్యకంగా పాలసీలు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇది ఆశించిన దాని కంటే సత్ఫలితాలు ఇచ్చింది.

ఈ తొమ్మిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి రూ.2,64,956 కోట్ల పెట్టుబడులు, వాటితో 23,000 పరిశ్రమలు వచ్చాయి. వాటిలో 17,77,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయి. వాటికి అవసరమైన రవాణా, క్యాటరింగ్, ఇతర సేవలు అందిస్తూ మరో 5-6 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు.

రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలు రావడం వలన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగడంతో ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌ నగరంలో నానాటికీ పెరుగుతున్న కార్లు, బైకులే ఇందుకు నిదర్శనం. వీటితో పాటు రియల్ ఎస్టేట్, వినోదం, రవాణా, పర్యాటక రంగాలు కూడ అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అగ్రస్థానంలోకి దూసుకుపోతోంది. కనుక తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక, ఐ‌టి పాలసీలకు, ప్రభుత్వ చిత్తశుద్ధికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు. 


Related Post