రికార్డ్ స్థాయిలో తెలంగాణ ఐ‌టి బిజినెస్

June 06, 2023


img

తెలంగాణ ఏర్పడక మునుపు ఐ‌టి కంపెనీలు ప్రధానంగా హైదరాబాద్‌ నగరంలోనే ఉండేవి. కానీ కేసీఆర్‌, కేటీఆర్‌ చాలా దూరదృష్టిటో ఆలోచించి రాష్ట్రంలో వివిద జిల్లాలలో ఐ‌టి హబ్‌లు, ఐ‌టి కారిడార్లు ఏర్పాటు చేసి, అత్యుత్తమైన ఐ‌టి పాలసీని ప్రకటించడంతో రాష్ట్రంలో ఐ‌టి రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. 

ఇన్ని ఐ‌టి కంపెనీలున్నప్పటికీ మంత్రి కేటీఆర్‌ ఏటా విదేశాలలో పర్యటిస్తూ, పారిశ్రామికవేత్తలను, ఐ‌టి కంపెనీల ప్రతినిధులను కలిసి మాట్లాడి కొత్తవాటిని రాష్ట్రానికి తీసుకువస్తూనే ఉన్నారు. అందుకే నేడు ఐ‌టి రంగంలో బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్‌ ఎదిగి, లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఐ‌టి కంపెనీలు దేశవిదేశాలకు ఐ‌టి సేవలు అందిస్తూ లక్షల కోట్లు ఆదాయం సమకూర్చుతున్నాయి. 

2022-23 సం.లలో తెలంగాణ నుంచి రూ.2,41,275 కోట్లు విలువగల ఐ‌టి ఉత్పత్తులు (సేవలు) దేశవిదేశాలకు ఎగుమతి జరిగిందని తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 9.36% పెరిగి, ఈసారి 31.44% వృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ వృద్ధి వలన రూ.57,706 కోట్లు అదనపు ఆదాయం సమకూరిందని తెలిపారు. 

ఐ‌టి రంగంలో గణనీయమైన ఈ వృద్ధి వలన 2022-23 సంవత్సరంలో ఒక్క ఐ‌టి రంగంలోనే కొత్తగా 1,27,594 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 16.29% వృద్ధి వలన ఐ‌టి రంగంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 9,05,71కి చేరిందని తెలిపారు. 

భారత్‌ మొత్తంలో ఐ‌టి రంగంలో 2,90,000 ఉద్యోగాలు సృష్టించబడితే వాటిలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 1,27,594 ఉద్యోగాలు లభించాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

తెలంగాణ ఏర్పడిన కొత్తలో అంటే 2013-14 ఆర్ధిక సంవత్సరంలో ఐ‌టి ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు ఉండగా, ఒక్క 2022-23 ఆర్ధిక సంవత్సరంలోనే తెలంగాణ నుంచి ఐ‌టి ఎగుమతుల విలువ రూ.57,706 కోట్లు ఉండటం చాలా గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

ఐ‌టి రంగంలో 2026 నాటికి రూ.3 లక్షల కోట్లు ఆదాయం, 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అయితే తమ కృషి, ప్రయత్నాలు ఫలిస్తుండటంతో రెండేళ్ళ ముందుగానే ఆ లక్ష్యం చేరుకోబోతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఐ‌టి రంగం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఐ‌టి కంపెనీలకు, వాటిలో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులకు అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 


Related Post