పట్టాలపై రైలు ఓ గండం... వెళ్తే ఓ దండం!

June 05, 2023


img

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనదే. దేశం నలుమూలలకు విస్తరించి ఉన్న మన రైల్వేశాఖ, దశాబ్ధాలుగా వందల కోట్ల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఈ రంగంలో అపారమైన అనుభవం సంపాదించి విదేశాలలో కూడా రైల్వే ప్రాజెక్టులు నిర్మించి ఇస్తోంది. ఇంత గొప్ప అనుభవం ఉన్న భారతీయ రైల్వేకు ఇటీవల ఒడిశాలో జరిగిన రైళ్ళ ప్రమాదం పెద్ద షాక్ అనే చెప్పాలి. 

ఈ ప్రమాదంలో మూడు రైళ్ళు ఒకదానినొకటి ఢీకొనగా 275 మంది మరణించారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పాటు రైల్వేశాఖకు అపారనష్టం కూడా కలిగింది. 

ఓ వైపు బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ ట్రైన్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లతో దూసుకుపోతున్న రైల్వేశాఖకు ఈ ప్రమాదం ఓ పెద్ద హెచ్చరిక, గుణపాఠం వంటిదే అని చెప్పకతప్పదు. అయితే, ఇదే సందర్భంగా రైల్వేసిబ్బంది అనుభవం, నైపుణ్యం, రేయింబవళ్ళు కష్టించి పనిచేసే గుణం కూడా మరోసారి యావత్ దేశ ప్రజలు చూశారు. 

ఈ ప్రమాదం జరిగిన 51 గంటలలోనే మళ్ళీ చెల్లాచెదురుగా పడిఉన్న బోగీలను తొలగించి, ఛిన్నాభిన్నం అయిన రైల్వేట్రాకును పునరుద్దరించారు. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ఘటనాస్థలం వద్ద నిలుచొని సహాయ, పునరుద్దరణ పనులను పర్యవేక్షించడం అభినందనీయం. రైల్వే ట్రాక్ పునరుద్దరించిన తర్వాత దానిపై మొట్టమొదట ఓ గూడ్స్ రైలును నడిపించారు. 

అది వెళుతున్నప్పుడు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సహా రైల్వే ఉన్నతాధికారులు ట్రాక్ పక్కనే నిలబడి చూశారు. గూడ్స్ రైలు నెమ్మదిగా ఆ పట్టాలపై నుంచి ముందుకుసాగిపోవడంతో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రెండు చేతులు జోడించి భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 

ఇంత పెను ప్రమాదం తర్వాత తొలిసారిగా మళ్ళీ మరో రైలు ఆ పట్టాలపై నుంచి ప్రయాణిస్తున్నందున ఆయన భావోద్వేగంతో ఆవిదంగా చేసిన్నట్లు అర్దమవుతూనే ఉంది. అయితే గంటకు 350 కిమీ వేగంగా నడిచే బుల్లెట్ ట్రైన్, గంటకు 130 కిమీ వేగంతో ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను నడిపించబోతున్నప్పుడు, పట్టాలపై 30-40 కిమీ వేగంతో ఓ గూడ్స్ రైలు సజావుగా ప్రయాణిస్తే రైల్వే మంత్రి సంతోషపడటాన్ని చూసినప్పుడు కాస్త బాధ కలుగుతుంది. 

దేశవ్యాప్తంగా నిత్యం వందల రైళ్ళు లక్షల మంది ప్రయాణికులతో పట్టాలపై పరుగులు తీస్తుంటాయి. వాటికీ, వాటిలో ప్రయాణించేవారి భద్రతకు రైల్వేశాఖ ఎన్ని ఏర్పాట్లు చేసినా, అప్పుడప్పుడు ఇటువంటి ఘోరప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కనుక వేగం ఎంత ముఖ్యమో ప్రయాణికుల ప్రాణాలు, వారి జీవితాలు కూడా అంతే ముఖ్యం. కనుక రైల్వేశాఖ ఈ ప్రమాదం నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సాగవలసిందే. 


Related Post