సిఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పధకాలను జోడు గుర్రాల్లా పరుగులు తీయిస్తున్నారని చెప్పవచ్చు. బిజెపి భాషలో చెప్పుకొంటే ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అనుకోవచ్చు. ఎందుకంటే, ఏ ప్రభుత్వామైన కేవలం అభివృద్ధి లేదా సంక్షేమ పధకాలకు మాత్రమే ప్రాధ్యాన్యం ఇస్తే చాప కింద నీరులా గుట్టుగా సమస్యలు పేరుకుపోతుంటాయి.
ఉదాహరణకు ఏపీలో వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పధకాలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది. సంక్షేమ పధకాల కోసం ఎడాపెడా అప్పులు చేస్తుండటంతో ఏపీ తీవ్ర ఆర్ధికసమస్యలలో చిక్కుకొంది. ఆ కారణంగా ఏపీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. కానీ కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ దాని ద్వారా వస్తున్న ఆదాయాన్ని సంక్షేమ పధకాల ద్వారా ప్రజలకు అందిస్తుండటంతో ప్రభుత్వంపై పెద్దగా ఒత్తిడిలేకుండా కొనసాగించగలుగుతోంది.
సంక్షేమ పధకాలలో కేసీఆర్ కిట్స్, బతుకమ్మ చీరల పంపిణీ, పాఠశాల విద్య, ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సలు, గొర్రెల పంపిణీ, రైతు బంధు వంటి అత్యుత్తమ పధకాలతో పాటు బిఆర్ఎస్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన దళితబంధు వంటి కొన్ని పధకాల భారాన్ని ప్రజలందరూ మోయాల్సివస్తోంది. కౌలు రైతులకు రైతుబంధుని వర్తింపజేయడానికి నిరాకరిస్తున్న కేసీఆర్, అది అవసరం లేని భూస్వాములకు వర్తింపజేస్తున్నందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నా ‘తగ్గేదేలే’ అంటున్నారు.
తెలంగాణ ఏర్పడక మునుపు సాగునీరు లేక అప్పులు చేసి బోర్లువేసుకొని నీళ్ళుపడక, పడినా విద్యుత్ సరఫరా లేక పొలాలు ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతులకు కేసీఆర్ రైతుబంధుగా మారి ఆదుకొంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఎక్కడికక్కడ ఎత్తిపోతల పధకాలు నిర్మిస్తూ పొలాలకు నీళ్ళు పారిస్తున్నారు. అయినా నీటి వసతికి దూరంగా ఉండిపోయిన గ్రామాలకు, రైతులు బోర్ల కింద సాగుచేసుకొనేందుకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. గ్రామాలలో చెరువులు పూడికలు తీయించి నీళ్ళు అందిస్తున్నారు. వాటితో భూగర్భజలాలు కూడా పెరుగుతుండటంతో కొంతవరకు రైతుల కష్టాలు తీర్చారు.
అయితే నేటికీ అకాల వర్షాలు, గిట్టుబాటు ధర లభించకపోవడం, గోనె సంచులు, గిడ్డంగుల కొరత, దళారుల బెడద, పంట ఉత్పత్తులకు సరైన మార్కెట్ లేకపోవడం వంటి అనేక సమస్యలతో రైతులు సతమతమవుతూనే ఉన్నారు. ఈవిదంగా మంచిచెడుల కలయికగా కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది.