తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటికీ 9 ఏళ్ళు మాత్రమే అయ్యింది. కానీ ఈ 9 ఏళ్ళలోనే రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వచ్చాయి. రాష్ట్రాభివృద్ధిని, రాజకీయాలను వేరు చేసి చూసిన్నట్లయితే కేసీఆర్ ఓ రాజకీయ నియంతృత్వం కళ్ళకు కట్టిన్నట్లు కనిపిస్తుంది. అయితే రాష్ట్రాభివృద్ధి కోసమే నియంతలా వ్యవహరించవలసి వస్తోందనే వాదనలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. వాటిలో కొంత నిజముంది కూడా.
ఏవిదంగా అంటే, కేసీఆర్ కలలు కన్న బంగారి తెలంగాణ సాధించాలంటే, ‘రాజకీయ విచ్చలవిడితనం’ పనికిరాదని కేసీఆర్ ముందే గుర్తించారు. తన ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడే ఎటువంటి అవరోధాలు లేకుండా బంగారి తెలంగాణ సాధనకు కృషి చేయగలనని కేసీఆర్ బలంగా నమ్మారు. అందుకే నిర్ధాక్షిణ్యంగా ప్రతిపక్షాలను బలహీనపరిచి చెల్లాచెదురు చేశారని చెప్పుకోవచ్చు. ఒకవేళ రాష్ట్రంలో మునుపటి పద్దతిలోనే రాజకీయాలు జరుగుతూ ఉండి ఉంటే, కేసీఆర్‌కు వాటితోనే సరిపోయేది. ఇంత అభివృద్ధి సాధ్యపడేది కాదు.
అయితే ఉద్యమాలు, బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, ప్రతిపక్షాలకు తావు లేకుండా నిరంకుశపాలన సాగిస్తుండటం ఆక్షేపనీయమే. ఒకవేళ గత ప్రభుత్వాలు కూడా ఇదేవిదంగా వ్యవహరించి ఉండి ఉంటే కేసీఆర్ పార్టీ స్థాపించగలిగేవారా... ఉద్యమాలు చేయగలిగేవారా?అనే కాంగ్రెస్ నేతల ప్రశ్న ఆలోచింపజేసేదే. కనుక కేసీఆర్ ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి ఉంటూ ఇంత అభివృద్ధి సాధించి ఉండి ఉంటే ఆయన నేడు మరో స్థాయిలో ఉండేవారు.
అయితే ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నా పోరాటాల గడ్డ తెలంగాణలో అది ఎన్నటికీ సాధ్యంకాదని నిరూపిస్తూ మళ్ళీ కాంగ్రెస్,బిజెపిలు బలపడటమే కాకుండా కేసీఆర్ నిరంకుశ వైఖరి కారణంగానే అనేక కొత్త పార్టీలు, రాజకీయ శక్తులు ఆవిర్భవించాయి. అవన్నీ ఏకమయ్యి కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కేవలం తొమ్మిదేళ్ళలో రాష్ట్ర రాజకీయాలలో ఇంత మార్పు రావడం చాలా ఆశ్చర్యకరమే. దానికి కేసీఆరే కారణం కనుక ఆ వ్యతిరేక శక్తులతో కేసీఆర్ నిరంతరం పోరాడక తప్పదు.