ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరినీ బిజెపిలోకి రప్పించలేకపోయా: ఈటల

May 29, 2023


img

తెలంగాణ బిజెపి పరిస్థితి ఏమిటో ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ మాటలతో స్పష్టమయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడిన తర్వాత ఆ స్థానంలోకి బిజెపి ప్రవేశించగలిగింది కానీ ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నట్లుగా అన్ని పార్టీల నుంచి నేతలు బిజెపిలోకి క్యూ కట్టలేదు. రాష్ట్రంలో సొంత బలం లేకపోవడం వలననే ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు బిజెపి చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసుకొంది. కానీ ఒక్క పెద్ద నేత బిజెపిలో చేరలేదు. అంటే బిజెపి వాపును చూసి బలుపు అనుకొంటున్నట్లు భావించవచ్చు.  

ఆ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కానీ బిజెపికి అసలు బలం లేదు కనుక ఆ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బలమైన నేతగా ఉన్న  జూపల్లి కృష్ణారావుని బిజెపిలో రప్పించేందుకు చాలా ప్రయత్నించాను. కానీ వారిరువురుకీ బిజెపితో కొన్ని ఇబ్బందులున్నాయని చెపుతూ నాకే ఎదురు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కనుక వారిని బిజెపిలోకి రప్పించలేకపోయాను,” అని తేల్చి చెప్పేశారు. 

కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారిరువురూ కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బిజెపి ప్రయత్నాలు ముగిశాయి కనుక ఇక కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించుకొంటే మంచిదేమో?లేకుంటే ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? వారు మనసు మార్చుకొని బిజెపిలో చేరిపోతే కాంగ్రెస్‌ ఓ మంచి అవకాశం చేజార్చుకొన్నట్లే అవుతుంది. 


Related Post