ఏపీ సిఎం జగన్‌కు మళ్ళీ సీబీఐ కష్టాలు షురూ?

May 27, 2023


img

అక్రమాస్తుల కేసులో 16 నెలలు చంచల్‌గూడ జైలులో గడిపి బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఆంద్రా ప్రజలు కనికరించి ఒక్క ఛాన్స్ ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అప్పటి నుంచి ఆ కేసుల విచారణ తెలుగు డైలీ సీరియల్లా అంతులేకుండా సాగుతూనే ఉన్నాయి. కనుక వాటి గురించి ఇక ఆలోచించనవసరం లేదనుకొంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జగన్‌ మెడకు చుట్టుకొనేలా ఉంది. 

ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసేందుకు సిద్దంగా ఉంది. కనుక ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తూ అరెస్ట్‌ కాకుండా తప్పించుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో మూడు రోజులుగా విచారణ జరుగుతోంది. 

శుక్రవారం హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు సీబీఐ ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది. దానిలో సిఎం జగన్మోహన్ రెడ్డికి వివేకా హత్య గురించి ముందే తెలుసని బాంబు పేల్చింది! వివేకా చనిపోయిన వార్త ఆరోజు ఉదయం 6.15 గంటలకు బయటకు పొక్కగా, అంతకంటే చాలా ముందే సిఎం జగన్మోహన్ రెడ్డికి ఆ వార్త తెలుసని సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొంది. తద్వారా ఈ హత్యతో జగన్‌కు కూడా ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. 

సహజంగానే ఇది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. అయితే ఇదంతా చంద్రబాబు నాయుడు, సీబీఐ కలిసి చేస్తున్న కుట్ర అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించడం విశేషం. కానీ ఆయన అభిప్రాయాలు లేదా ఆరోపణలతో సీబీఐ లేదా కోర్టు తీర్పులు మారిపోవు కనుక ఒకవేళ తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ నిరాకరిస్తే సీబీఐ ఆయనను వెంటనే అరెస్టు చేయవచ్చు. 

ఒకవేళ ఆయన అరెస్ట్‌ అయితే ఈ హత్య కేసుతో జగన్మోహన్ రెడ్డికి కూడా సంబందం ఉందని చెప్పిన్నట్లయితే ఆయనకు మళ్ళీ కష్టాలు మొదలైనట్లే. బహుశః అందుకే అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా కాపాడుకొంటున్నారని టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలు ఆలోచింపజేస్తాయి.


Related Post