మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కారే కదా ఉంది?

May 27, 2023


img

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ రావాలని బిజెపి నేతలు వాదిస్తుంటారు. అయితే పక్కనే ఉన్న మహారాష్ట్రలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ నేటికీ మహారాష్ట్రలో పలు గ్రామాలలో ప్రజలు కనీసం తాగునీరు కూడా లేక అల్లాడుతున్నారు. దీంతో తాగునీరు కోసం మహిళలు బిందెలు నెత్తిన పెట్టుకొని ఈ మండే ఎండల్లో కిలోమీటర్ల దూరం నడుచుకొంటూ వెళ్ళి పాడుబడిన బావులలో అడుగంటిన కలుషిత నీళ్ళను తోడి తెచ్చుకొంటున్నారు.

అయితే అదీ పైనుంచి తోడుకొనే అన్ని నీళ్ళు లేకపోవడంతో మహిళలు అందరూ కూడబలుకొని వారిలో కాస్త ధైర్యం ఉన్న మహిళలను తాడు సాయంతో ఆ బావిలోకి దింపుతున్నారు. ఈ ప్రయత్నంలో పలుమార్లు మహిళలు పట్టుతప్పి బావిలో చనిపోతున్నారు లేదా తీవ్రంగా గాయపడుతున్నారు. అయినా వేరే గత్యంతరం లేకపోవడంతో నేటికీ మహారాష్ట్ర పల్లెలలో మహిళలు ఈ సాహసానికి పూనుకొంటున్నారు.

అంత కష్టపడి ఆ నీళ్ళను తోడి తెచ్చుకొన్నా అవి కలుషితమై ఉండటంతో ఆ నీళ్ళను తాగి అనారోగ్యం పాలవుతున్నారు. అసలే పేదరికం, ఎండలు, నీళ్ళకు కరువు... ఇటువంటి పరిస్థితులలో ఇంటి ఇల్లాలు అనారోగ్యం పాలైతే ఆ కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఊహించుకోవచ్చు. 

ట్విట్టర్‌లో రాయటర్స్ మీడియా సంస్థ పోస్ట్ చేసిన ఈ వీడియోపై, తెలంగాణ సిఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ స్పందిస్తూ, “ఒకే దేశం... వేర్వేరు జీవితాలు. ఎంత బాధాకరం? కృతనిశ్చయంతో ప్రయత్నిస్తే ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ప్రతీ ఇంటికీ స్వచ్చమైన త్రాగునీరు అందించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది. జయహో తెలంగాణ,” అని ట్వీట్‌ చేశారు.                  


Related Post