రాజదండం కాదు... రాజకీయాలే: కాంగ్రెస్‌

May 26, 2023


img

బ్రిటిష్ పాలన నుంచి భారత్‌ విముక్తి పొందిన తర్వాత అధికార బదిలీకి గుర్తుగా మద్రాసులో తయారు చేయించిన 5 అడుగుల పొడవైన రాజదండం (సెంగోల్)ను లార్డ్ మౌంట్ బాటన్ నుంచి తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ అందుకొన్నారని, ఇన్నేళ్ళుగా అలహాబాద్ మ్యూజియంలో భద్రపరిచిని ఆ రాజదండాన్ని కొత్తగా నిర్మించిన పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్‌ కుర్చీకి సమీపంలో అందరికీ కనబడేలా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేత ప్రారంభోత్సవం చేయించకుండా ప్రధాని నరేంద్రమోడీ చేయడాన్ని తప్పు పడుతూ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్‌, మిత్రపక్షాలు, ఇప్పుడు ఈ రాజదండం గురించి మరో యుద్ధం ప్రారంభించాయి. అదేమీ రాజదండం కాదని, 1947లో తమిళనాడులో ఓ హిందూ మత సంస్థ దానిని తయారుచేయించి తొలి ప్రధాని నెహ్రూకి బహుకరించిందని, కానీ మోడీ ప్రభుత్వం, దాని సోషల్ మీడియా డప్పు బృందం, వచ్చే ఏడాది జరుగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దాని చుట్టూ ఓ కొత్త కధ అల్లి ప్రచారం చేస్తూ తమిళ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేసింది. లార్డ్ మౌంట్ బాటన్ ఆ రాజదండాన్ని నెహ్రూకి ఇచ్చి ఉండి ఉంటే, బ్రిటిష్ పాలకులు ఈ విషయాన్ని తప్పకుండా రికార్డులలో నమోదు చేసి ఉండేవారని, కానీ అటువంటి రికార్డు ఏమీ లేదని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. 

కాంగ్రెస్‌ నేతల విమర్శలకు అమిత్‌ షా వెంటనే ఘాటుగా బదులిస్తూ, “భారతీయ సంస్కృతి అంటే కాంగ్రెస్‌కు ఎందుకు ఇంత ద్వేషం? పవిత్రమైన సెంగోల్‌ని ఆనాడు తమిళనాడులోని ఓ శైవమఠం ప్రతినిధులు స్వయంగా నెహ్రూకి అందజేశారు. ఈ సందర్భంగా అధికార బదిలీ కార్యక్రమం కూడా నిర్వహించారు. కానీ దానికి విలువ ఇవ్వకుండా అదో ‘వాకింగ్ స్టిక్’ అన్నట్లు ఇంతకాలం అలహాబాద్ మ్యూజియంలో పెట్టారు. ఆ సెంగోల్ గురించి ఆ శైవమఠమే వివరించింది కానీ కాంగ్రెస్ పార్టీ దానిని బోగస్ అనడం అవమానకరం,” అని ట్వీట్‌ చేశారు. 

అయితే ఆనాడు తమిళనాడుకు చెందిన తీరువడుత్తురై మఠానికి చెందిన ఓ స్వామీజీ తన అనుచరులతో కలిసి 1947, ఆగస్ట్ 14 అర్దరాత్రి లార్డ్ మౌంట్ బాటన్‌ చేతిలో పెట్టి తిరిగి తీసుకొని, దానిని గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత ఆగస్ట్ 14 అర్దరాత్రి స్వాతంత్ర ప్రకటనకు 15 నిమిషాల ముందు నెహ్రూ చేతికి దానిని అందించగా తీసిన ఫోటోలు, అధికార బదిలీ ప్రక్రియకు సంబందించి వార్తలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చాయి. 

ఆ తర్వాత అది కనిపించలేదు. అది అలహాబాద్ మ్యూజియంలో భద్రపరచబడి ఉందనే విషయం 1978, ఆగస్ట్ 15న కంచి పీఠాధిపతి చంద్రశేఖర్ సరస్వతి స్వామి తన శిష్యులలో ఒకరైన డాక్టర్ బీఆర్ సుబ్రహ్మణ్యంకు తెలియజేశారు. దానినే ఇప్పుడు మోడీ ప్రభుత్వం అలహాబాద్ నుంచి తీసుకువచ్చి కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేయబోతోంది.


Related Post