పొంగులేటితో ఈటల రాజేందర్‌ రహస్య భేటీ... డీల్ కుదిరినట్లేనా?

May 25, 2023


img

టిఆర్ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో తెలంగాణ బిజెపి చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ గురువారం మధ్యాహ్నం రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌ శివారులోగల ఓ ఫామ్‌హౌస్‌లో వారు ముగ్గురే సుమారు నాలుగు గంటలసేపు మాట్లాడుకొన్నారు. 

ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు కలిసి కొన్ని రోజుల క్రితం ఖమ్మం వెళ్ళి వారిద్దరినీ బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పొంగులేటి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో 10 సీట్లు తనకే ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఇవికాక మరికొన్ని డిమాండ్స్ కూడా పెట్టి ఉండవచ్చు. ఆ తర్వాత ఈటల రాజేందర్‌ వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడే మూడు రోజుల పాటు మకాం వేసి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో వరుసగా భేటీ అయ్యారు.

ఆ తర్వాత బండి సంజయ్‌ తదితరులకు అమిత్‌ షా నుంచి పిలుపు వచ్చింది. బండి సంజయ్‌ ఢిల్లీ చేరుకొనేసరికి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు. కనుక పొంగులేటిని, జూపల్లిని బిజెపిలో చేర్చుకొనే విషయమై వారితో కూడా అమిత్‌ షా మాట్లాడి ఉండవచ్చు. బండి సంజయ్‌ కూడా పొంగులేటి పార్టీలోకి రావలనే కోరుకొంటున్నారు కనుక ఆయన కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసి ఉండవచ్చు.

కనుక పొంగులేటి డిమాండ్లన్నిటికీ లేదా కొన్నిటికి బిజెపి అధిష్టానం ఒప్పుకొని ఉండవచ్చు. అదే విషయమై పొంగులేటితో చర్చించి పార్టీలో చేరేందుకు ఒప్పించేందుకు ఈటల రాజేందర్‌ నేడు వారితో రహస్య సమావేశమై ఉండవచ్చు. 

ఒకవేళ బిజెపితో డీల్ సెట్ అయితే “పదవులు, అధికారం, కాంట్రాక్టుల కోసం ఆశపడటం లేదని, మోడీ నాయకత్వంలో దేశం, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఆలోచనతోనే బిజెపిలో చేరుతున్నామని, వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ను గద్దె దించి బిజెపిని అధికారంలోకి తీసుకువస్తామంటూ,” పొంగులేటి కొన్ని రొటీన్‌ డైలాగ్స్ చెప్పవచ్చు. 

ఒకవేళ బిజెపితో డీల్ సెట్ కాకపోయుంటే, ఇదివరకు వినిపించిన ఊహాగానాలను నిజం చేస్తూ ‘టిఆర్ఎస్‌’ అనే పేరు వచ్చేలా కొత్త పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించవచ్చు. కనుక నేడో రేపో పొంగులేటి, జూపల్లి బిజెపిలో చేరికపై పూర్తి స్పష్టత రావచ్చు.


Related Post