పార్లమెంట్ ప్రారంభోత్సవం మోడీ చేస్తారా? అయితే మేము రాము!

May 25, 2023


img

కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేయనున్నారు. కనుక ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలన్నిటినీ ఆహ్వానించింది. కానీ ప్రతిపక్షాలు హాజరుకాబోమని తెలియజేశాయి. 

రాజ్యాంగాధినేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేత పార్లమెంట్ భవనాన్ని ప్రారంభింపచేయాల్సి ఉండగా, ప్రధాని మోడీ చేస్తుండటాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. ఇది రాష్ట్రపతిని అవమానించడమే అని, ఇది మోడీ అహంకారానికి మరో నిదర్శనమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేని ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం సిగ్గుచేటని, ఇప్పటికైనా ఆయన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించి ఆమె చేత పార్లమెంట్ భవనాన్ని ప్రారంభింపజేయాలని 19 విపక్ష పార్టీలు సూచించాయి. లేకుంటే తాము ఈ కార్యక్రమానికి హాజరుకాబోమని తేల్చి చెప్పాయి. వాటిలో  కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌, ఆమాద్మీ, శివసేన, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ తదితర పార్టీలున్నాయి.

అయితే బిఆర్ఎస్ పార్టీ దీనిపై ఆలోచించుకొని చెపుతామని దూరంగా ఉండిపోయింది. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించబోతుండటాన్ని స్వాగతించారు. దేశంలో అన్ని పార్టీలు రాజకీయాలు, విబేధాలు పక్కన పెట్టి భారతీయఆత్మకు ప్రతిరూపమైన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. 

ఎన్నికల సంవత్సరంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈవిదంగా రాజకీయ పునరేకీకరణకు పునాది వేయడం విశేషం. బిజెపి, బీజేపీయేతర శక్తులని, ఆ రెండింటికీ మద్య ఊగిసలాడుతున్న పార్టీలను కూడా ఈ కార్యక్రమంలో విడదీసి స్పష్టంగా చూపిస్తోంది.


Related Post