రాజగోపాల్ రెడ్డి కుర్చీలో కర్చీఫ్ వేస్తున్నారా?

May 23, 2023


img

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కధ అందరికీ తెలిసిందే. చేజేతుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉపఎన్నికలలో భంగపడ్డారు. నల్గొండ జిల్లాలో తనకు తిరుగేలేదని ప్రగల్భాలు పలికిన ఆయన మునుగోడు ఉపఎన్నికలలోనే ఓడిపోయి నవ్వులపాలయ్యారు. ఆ కారణంగానే బిజెపిలో ఆయనను పట్టించుకొనే నాధుడే లేకుండాపోయారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదే చెప్పుకొని బాధపడ్డారు. 

“రాష్ట్ర నాయకత్వం మార్చాలని నేను చెప్పను కానీ మా పార్టీ అధిష్టానానికి ఎవరిని ఎక్కడ పెట్టాలో ఖచ్చితంగా తెలుసు. ఎవరికైతే కేసీఆర్‌ని ఓడించాలని కసి ఉంటుందో అటువంటి వ్యక్తిని ముందుపెట్టి పార్టీని నడిపించాలి. ఉపఎన్నికలు జరిగి ఆర్నెల్లు కానీ ఇంతవరకు పార్టీ నాకు ఎటువంటి బాధ్యత అప్పగించలేదు. అసలు పార్టీలో మమ్మల్ని పట్టించుకొనే నాధుడే లేడు. నావంటి వాడికి బాధ్యతలు అప్పగించకుండా పక్కన పెట్టడం సరికాదని భావిస్తున్నాను,” అని అన్నారు.     

పార్టీ విధానం గురించి మాట్లాడుతూ, “ఉత్తరాది రాష్ట్రాలలో మా పార్టీ అనుసరిస్తున్న విధానాలనే ఇక్కడ తెలంగాణలో కూడా అమలుచేయాలని భావిస్తోంది. కానీ ఇది పనిచేయదని నేను చాలా సందర్భాలలో చెప్పాను. కానీ పార్టీలో ఎవరూ నా మాట పట్టించుకోవడం లేదు. ఇక్కడకి ఎవరో ఒక్కరూ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వచ్చి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనించి, సరైన అంచనాతో ముందుకు సాగితే కేసీఆర్‌ను గద్దె దించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మా అధిష్టానం మా సూచనలు, అభిప్రాయాలను పట్టించుకోకుండా ఉత్తరాది రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలనే ఇక్కడ అమలుచేయాలని ప్రయత్నిస్తోంది,” అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను బట్టి బిజెపి వైఖరి పట్ల, ముఖ్యంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి తాను అన్నివిధాలా తగినవాడినని భావిస్తున్నట్లున్నారని అర్దమవుతోంది. 

అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇంచుమించు ఇదేవిదంగా మాట్లాడుతూ వ్యవహరిస్తుండటం అందరూ గమనించే ఉంటారు. కోమటిరెడ్డి సోదరులు వేరే పార్టీలలో ఒకరి కింద పనిచేయలేరని స్పష్టం అవుతోంది కనుక వారే సొంతంగా పార్టీ ఏర్పాటుచేసుకొంటే మంచిదేమో? అప్పుడు వారికి నచ్చిన్నట్లు పార్టీని నడిపించుకోవచ్చు కదా?              

Video Courtecy: Toli Velugu 

Related Post