కేసీఆర్‌తో దోస్తీ మనకొద్దు నితీశ్‌జీ: రాహుల్

May 23, 2023


img

వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించి ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించేందుకు ప్రస్తుతం దేశంలో ముగ్గురు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారే బిహార్‌, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీ, కేసీఆర్‌. వారిలో నితీశ్, మమతా ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా కలిసి వచ్చే పార్టీలతో కూటమి ఏర్పాటు చేసేందుకు వారిరువురూ ఇప్పటికే పలువురు నేతలతో వరుసగా సమావేశమై చర్చించారు. 

మమతా బెనర్జీ సూచన మేరకు నితీశ్ కుమార్‌ వచ్చే నెలాఖరులోగా పాట్నాలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీల నేతలతో ఓ సమావేశం ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన కేసీఆర్‌ని కూడా కలుపుకుపోయేందుకు త్వరలో హైదరాబాద్‌ వచ్చి భేటీ అవ్వాలనుకొన్నారు. కానీ రాహుల్ గాంధీ వారించిన్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ ఏర్పాటు చేస్తే టిఆర్ఎస్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్‌ మాట తప్పడమే కాకుండా, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి రాజకీయంగా చావుదెబ్బ తీశారని కనుక కేసీఆర్‌తో మళ్ళీ కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఆసక్తిలేదని చెప్పిన్నట్లు తెలుస్తోంది. అదీగాక ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్‌ పార్టీల మద్య రాజకీయ పోరు కొనసాగుతుండటం, వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ని గద్దె దించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుండటం, కేసీఆర్‌ కూడా కాంగ్రెస్ పార్టీని ద్వేషిస్తున్నందున ఆయనకు దూరంగా ఉంటే మంచిదని రాహుల్ గాంధీ నితీశ్ కుమార్‌కి సూచించిన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒకవేళ కాంగ్రెస్‌ మిత్రపక్షాల కూటమి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్‌ మద్దతు అవసరమైతే అప్పుడు ఆలోచించవచ్చని రాహుల్ గాంధీ సూచించిన్నట్లు తెలుస్తోంది. కనుక నితీశ్ కుమార్‌ కేసీఆర్‌తో భేటీ ఆలోచన విరమించుకొన్నట్లు తెలుస్తోంది.


Related Post