ఖమ్మంలో నువ్వో బచ్చగాడివి: పువ్వాడ

May 22, 2023


img

ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌, బిఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్య నువ్వెంత అంటే నువ్వెంత అనుకొనే స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ని గద్దె దించుతానని, ప్రగతి భవన్‌, సచివాలయం గేటు తలుపులు కూడా తాకనీయనని, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో బిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకొనీయనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శపధం చేశారు. 

వాటికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ స్పందిస్తూ, “మా కుటుంబం 70 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉంది. ఖమ్మం రాజకీయాలలో నువ్వో బచ్చగాడివి. కానీ నీ దగ్గర డబ్బుందని విర్రవీగుతూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నావు. కానీ నీ డబ్బు మూటలు నిన్ను, నీ వాళ్ళని గెలిపించలేదని గుర్తుంచుకో. తెలంగాణ ప్రజలందరూ మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో నువ్వు ఎంత డబ్బు వెదజల్లినా గెలిచేది మళ్ళీ అధికారంలోకి రాష్ట్రాన్ని పాలించేది మేమే అని గుర్తుంచుకో,” అంటూ ఘాటుగా బదులిచ్చారు. 

మంత్రి పువ్వాడ చెప్పిన్నట్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్ద వేలకోట్లు ఉన్నందునే రెండు జిల్లాలలో తన అభ్యర్ధులను ప్రకటించగలిగారు. ఆయనకు అర్ధబలం ఉంది కనుకనే అంగబలం కూడా సమకూర్చుకొన్నారు. ఆయనకు ఆ రెండూ పుష్కలంగా ఉన్నందునే కాంగ్రెస్‌, బిజెపిలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. అదే... జూపల్లి కృష్ణారావును తమ పార్టీలో చేరాలని ఒత్తిడి చేయడం లేదు కదా?

ఎన్నికలను అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ఎన్నికల హామీలు ఎంతగా ప్రభావితం చేయగలవో డబ్బు కూడా అంతే ప్రభావితం చేయగలదు. కనుక బిఆర్ఎస్ పార్టీని, పొంగులేటి శక్తి సామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయలేము. ఒకవేళ ఈటల రాజేందర్‌ రాయబారం ఫలించి ఎన్నికలలోగా బిజెపిలో చేరితే పొంగులేటి మరింత శక్తివంతుడవుతారు కూడా.


Related Post