గుంటూరులో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం... అందరూ డుమ్మా!

May 22, 2023


img

మహారాష్ట్రలో నాందేడ్‌, ఔరంగాబాద్, నాగపూర్ జిల్లాలకు బిఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న సిఎం కేసీఆర్‌ పొరుగునే ఉన్న ఏపీ వైపు తొంగిచూడకపోవడం విచిత్రమే. ఏపీలో కూడా పార్టీని విస్తరిస్తామని చెపుతూ తోట చంద్రశేఖర్‌ని పార్టీ ఏపీ అధ్యక్షుడుగా నియమించారు. 

ఆయన తన సొంత డబ్బుతో గుంటూరులో 5 అంతస్తులతో పార్టీ కోసం కార్యాలయ భవనం కూడా నిర్మించారు. దాని ప్రారంభోత్సవానికి సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. కానీ ఏ ఒక్కరూ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. నాందేడ్‌లో శిక్షణా శిబిరాలు నిర్వహించడానికి, ఎక్కడో ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రాభోత్సవానికి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, పక్కనే గుంటూరులో తొలిసారిగా పార్టీ కార్యాలయం ప్రారంభం అవుతుంటే దానికి వెళ్ళకపోవడం, కనీసం మంత్రి హరీష్‌ రావు లేదా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వంటివారినైనా పంపించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. హైదరాబాద్‌ నుంచి ఎవరూ రాకపోవడంతో తోట చంద్రశేఖరే, తన అనుచరుల సమక్షంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకొన్నారు. కేసీఆర్‌ మొహం చాటయడంతో ఆయన నవ్వులపాలయ్యారు. 

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని, కుమారస్వామిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతానని చెప్పిన కేసీఆర్‌, ఎన్నికలలో అటువైపు తొంగిచూడలేదు. కనీసం ఆర్ధికసాయం అందించలేదని కుమారస్వామి ఆక్రోశించారు కూడా. ఇప్పుడు ఏపీలో తోట చంద్రశేఖర్‌ పరిస్థితి కూడా అలాగే మారుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 



Related Post