తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ పార్టీలో నేతలు ముఠాలు కట్టి కీచులాడుకొంటూనే ఉంటారు. టికెట్లు లేదా పదవుల కోసం పోటీ పడుతూనే ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంతో మంది బలమైన, మంచి ప్రజాధారణ ఉన్న నాయకులున్నప్పటికీ వారి ఈ అనైఖ్యత, వారి వ్యవహారశైలే, బిఆర్ఎస్, బిజెపిలు రాజకీయంగా దానిపై పైచేయి సాధించేందుకు అవకాశం కల్పించాయని చెప్పకతప్పదు. అయినా కాంగ్రెస్ నేతలలో ఎటువంటి మార్పు లేదు. ఈ కారణంగానే కె.జానారెడ్డి వంటి సీనియర్ నాయకుడు కూడా సాగర్ ఉపఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడం అందరూ చూశారు.
అదే... కర్ణాటకలో కాంగ్రెస్ నేతలందరూ తమ పంతాలు, విభేధాలను అన్నిటినీ పక్కనపెట్టి కలిసికట్టుగా పోరాడి శాసనసభ ఎన్నికలలో విజయం సాధించారు. కనీసం అది చూసైనా తెలంగాణ కాంగ్రెస్ నేతలలో తీరులో మార్పు రాకపోవడం విస్మయం కలిగిస్తుంది.
మాజీ పిసిసి అధ్యక్షుడు, నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీలోనే కొందరు నాపై సోషల్ మీడియాలో పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తుండటం చాలా బాధాకరం. అందరూ కలిసికట్టుగా పోరాడిపార్టీని అధికారంలోకి తెచ్చుకోవలసిన ఈ సమయంలో మనలో మనమే పోరాడుకొంటూ మన పార్టీని మనమే బలహీనపరుచుకొంటున్నాము. పార్టీలో ఈ పరిస్థితి మారాలని కోరుకొంటున్నాను. దీని కోసం నావంతు ప్రయత్నాలు నేను చేస్తున్నాను. వచ్చే ఎన్నికలలో కోదాడ శాసనసభ నియోజకవర్గం నుంచి మనం విజయం సాధించడం తధ్యం. అంతేకాదు... ఈసారి 50 వేల కంటే మెజార్టీ తగ్గితే నేను రాజకీయాల నుంచి తప్పుకొంటాను,” అని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలం, ఆత్మవిశ్వాసం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలలో స్పష్టంగా వినబడింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలమనే గట్టి నమ్మకం ఉన్నప్పటికీ నేతల కుమ్ములాటల వలన ఓడిపోతున్నామనే విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలతో స్పష్టమవుతోంది కదా?