సెప్టెంబర్‌ 30 నుంచి రూ.2,000 నోట్లు చెల్లవు: రిజర్వ్ బ్యాంక్

May 19, 2023


img

రూ.2,000 నోట్లను ఉపసంహరించుకొంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను 2023, సెప్టెంబర్‌ 30లోగా బ్యాంకులలో మార్చుకోవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు రూ.2,000 నోట్లు జారీ చేయరాదని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. 

ప్రధాని నరేంద్రమోడీ 2016, నవంబర్‌ 8వ తేదీ అర్దరాత్రి నుంచి రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి యావత్ దేశానికి పెద్ద షాక్ ఇచ్చారు. ఆనాడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలన వార్తగా నిలిచింది కూడా. అయితే వాటి స్థానంలో రూ.500 కొత్త నోట్లతో పాటు  రూ.2,000ని ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలపాలైంది. నల్లధనం అరికట్టేందుకు పెద్దనోట్లు రద్దు చేస్తున్నప్పుడు ఇంకా పెద్ద నోటు జారీ చేయడం ఏమిటని దేశప్రజలందరూ ముక్కున వేలేసుకొన్నారు. అయితే రూ.2,000 నోట్లు జారీ చేయడం వెనుక మోడీ చాలా దూరం ఆలోచించి ఉండవచ్చని అవి కూడా సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించవచ్చని ఆనాడే మైతెలంగాణ.కామ్ ఊహించి చెప్పింది. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ రూ.2,000 నోట్లను రద్దు చేయడం లేదు కానీ వాటిని ఎన్నికల గంట మ్రోగేలోగా ఉపసంహరించుకొంటోంది. ఇది దేశంలో అన్ని ధనిక రాజకీయపార్టీలకు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. 

ఇంకా రూ.2,000 నోట్లతో మళ్ళీ భారీగా నల్లధనం పోగేసుకొన్న రాజకీయ నేతలకు, కార్పొరేట్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలలో వందల కోట్లు టర్నోవర్ చేసేవారికి ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. వారందరూ తప్పనిసరిగా తమవద్ద పోగుచేసుకొన్న నల్లధనాన్ని గడువులోగా బ్యాంకులలో జమా చేయక తప్పదు. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు. అలాగని ఆ నల్లధనాన్నిబయటకుతీస్తే ఆదాయపన్ను శాఖ, ఈడీ అధికారులకు ఈ విషయం తెలిసిపోతుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో రేపటి నుంచి మోడీ ప్రభుత్వంపై అన్ని పార్టీలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టవచ్చు. అన్నిటికంటే ఏవి ఎక్కువగా విమర్శిస్తే వాటి వద్ద భారీగా నల్లధనం ఉందని గ్రహించవచ్చు. ఇంత తక్కువ సమయంలో దానిని మార్చుకోలేక ఆక్రోశిస్తున్నట్లు భావించవచ్చు. 

రూ.2,000 నోట్లన్నీ నల్లకుబేరుల ఖజానాలలో జమా అయిపోయాయి కనుక సామాన్య ప్రజలు వాటిని చూసి చాలా కాలమే అయ్యింది. కనుక ఈ నిర్ణయం వారిపై ఎటువంటి ప్రభావం చూపదు.


Related Post