ఈటల హైదరాబాద్‌కు... ఢిల్లీకి బండి?

May 19, 2023


img

తెలంగాణ బిజెపిలో ఏదో పెద్ద మార్పే జరుగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్నారనే విషయం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి మీడియా చెప్పేవరకు తెలియదంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఆయనతో భేటీ అయ్యినట్లు సమాచారం. ఆ తర్వాత వారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి తదితర బిజెపి నేతలను ఢిల్లీకి పిలిపించుకొని,ఒక్కొక్కరితో వేర్వేరుగా మాట్లాడారు. ఈటల రాజేందర్‌ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకోగానే బండి సంజయ్‌కి పిలుపు రావడంతో ఆయన ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

కర్ణాటక ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత తెలంగాణ మీద దృష్టి పెడతామని అమిత్‌ షా, జేపీ నడ్డా ముందే చెప్పారు కనుక వాటి గురించి చర్చించడానికే అయితే ఇలా ఒక్కొక్కరితో వేర్వేరుగా మాట్లాడరు. బండి సంజయ్‌తో సహా రాష్ట్ర బిజెపి నేతలందరితో ఒకేసారి సమావేశమవుతారు. కనుక ఇది ఎన్నికల సన్నాహాలకు సంబందించిన వ్యవహారం కాదని భావించవచ్చు.

బండి సంజయ్‌ నాయకత్వం, వైఖరిపై పార్టీలో ముఖ్యనేతలకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆయన కేసీఆర్‌ని బలంగానే ఢీకొంటున్నారు కానీ పార్టీని నడిపిస్తున్న తీరు సరిగా లేదని, పార్టీలో నేతలందరినీ కలుపుకుపోకుండా అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన వైఖరి కారణంగానే ఇతర పార్టీలలో నించి నేతలు బిజెపిలో చేరేందుకు రావడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

కర్ణాటకలో విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ బిజెపి ఓడిపోయింది. తెలంగాణలో కూడా ఓడిపోతే మరో 5 ఏళ్ళ వరకు బిజెపికి దక్షిణాది రాష్ట్రాల తలుపులు మూసుకుపోతాయి. కనుక తెలంగాణ తెలంగాణ బిజెపి పగ్గాలు వేరే వారికి అప్పగించేందుకే ఈ చర్చలని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమో కాదో... త్వరలోనే తేలిపోవచ్చు. 


Related Post