కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణలో ఇదేం లొల్లి?

May 19, 2023


img

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. సంతోషం! కానీ అక్కడ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపి, బిఆర్ఎస్ మూడు పార్టీల మద్య గొడవ మొదలవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

కర్ణాటకలో గెలిచిన్నట్లే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని, కనుక కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి వెళ్ళిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి సీనియర్ నేతలందరూ పార్టీలోకి తిరిగి రావాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

కేసీఆర్‌ని వ్యతిరేకించే రాజకీయ శక్తుల పునరేకీకరణ చాలా అవసరం కనుక ఈటల రాజేందర్‌తో సహా బిజెపిలో ఉన్న నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. కేసీఆర్‌ను బిజెపి మాత్రమే నిలువరించి ఓడించగలదనే నమ్మకంతో వారందరూ బిజెపిలోకి వెళ్ళారని, కానీ కేసీఆర్‌-మోడీ, బిజెపి-బిఆర్ఎస్‌ వేర్వేరు కావనే విషయం కర్ణాటక ఎన్నికలలో బయటపడిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

కనుక కేసీఆర్‌ను ఓడించాలనుకొనేవారందరూ కాంగ్రెస్‌లోకి రావాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే వారి కోసం తాను 10 మెట్లు దిగేందుకు సిద్దంగా ఉన్నానని రేవంత్‌ రెడ్డి చెప్పారు. కర్ణాటకలో బిజెపిని గెలిపించి కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు కేసీఆర్‌ శతవిదాల ప్రయత్నించారని, కానీ అక్కడ కాంగ్రెస్‌ గెలిస్తే పట్టించుకోనక్కరలేదని కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


ప్రస్తుతం బిజెపిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి వచ్చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఫైర్ అయ్యారు. “కాంగ్రెస్ పార్టీలో నా మిత్రులు నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్న మాట నిజమే. కానీ కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచినంతమాత్రన్న నేను బిజెపిని వీడి కాంగ్రెస్‌లోకి ఎలా వెళ్ళిపోతాననుకొన్నారు?గుజరాత్‌లో బిజెపి గెలిచింది కానీ కర్ణాటకలో ఓడిపోయింది. కనుక కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణలో కూడా గెలుస్తుందని ఎలా చెప్పగలరు?

రాష్ట్ర కాంగ్రెస్‌లో నాలుగు గుంపులున్నాయి. ఎవరి పాదయాత్రలు వారివే. వారందరికీ ముఖ్యమంత్రి పదవి కావాలి. జాతీయస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వంలేని పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీలోకి నేనెందుకు తిరిగి వెళతాను?కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్‌ని ఓడించే శక్తి ఉందా?కేసీఆర్‌ను బిజెపి మాత్రమే ఓడించగలదు. కనుక నన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం కాదు... మీరందరూ వచ్చి బిజెపిలో చేరండి,” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

Video Courtecy: NTV

Related Post