అమెరికాలో కేటీఆర్‌... హైదరాబాద్‌కు వార్నర్ బ్రదర్స్!

May 18, 2023


img

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. న్యూయార్క్ నగరంలో అడుగుపెట్టిన తొలిరోజే సుప్రసిద్ద అంతర్జాతీయ మీడియా సంస్థ ‘వార్నర్ బ్రదర్స్’ఆర్థిక విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలెగ్జాండ్రా కార్టర్‌తో సమావేశమయ్యి,  హైదరాబాద్‌లో ఆ సంస్థ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం (ఐడీసీ)ని ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. 

ఈ సంతోషకరమైన విషయం తెలియజేస్తూ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఓ సుదీర్గమైన లేఖను పోస్ట్ చేశారు. దానిలో ‘వార్నర్ బ్రదర్స్-డిస్కవరీ’ సంస్థ హైదరాబాద్‌లో తమ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని, దాని మొదటి దశలోనే 1,200 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ కలిగిన హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్‌, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్‌, యానిమల్‌ ప్లానెట్‌, కార్టూన్‌ నెట్‌వర్క్‌, సినీమాక్స్‌, పోగో, టూన్‌కార్ట్‌, సీఎన్‌ఎన్‌ (న్యూస్ ఛానల్), టీసీఎల్‌, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్‌, హెచ్‌జీటీవీ, క్వెస్ట్‌ ఛానల్స్ అన్నీ వార్నర్‌ బ్రదర్స్-డిస్కవరీ మీడియా సంస్థ అధ్వర్యంలో నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కాక వార్నర్ బ్రదర్స్ భారీ బడ్జెట్‌తో అనేక సినిమాలు కూడా నిర్మిస్తుంటుంది. సినీ, మీడియా రంగంలో ఇంతటి సుప్రసిద్ద ‘వార్నర్ బ్రదర్స్-డిస్కవరీ’ సంస్థ భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో తమ కార్యాలయం ఏర్పాటు చేసుకోబోతుండటం గొప్ప విషయమే. పాన్ ఇండియా మూవీలు తీస్తూ, భారతీయ సినీపరిశ్రమను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్ళిన తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడిన హైదరాబాద్‌ నగరంలోనే ‘వార్నర్ బ్రదర్స్-డిస్కవరీ’ సంస్థ కూడా వస్తుండటంతో, సినీ, మీడియా రంగాలకు కూడా హైదరాబాద్‌ కేరాఫ్ అడ్రస్‌గా మారాబోతోందని భావించవచ్చు.


Related Post