హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ విషయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూడా తెలియకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. కర్ణాటకలో బిజెపి ఓడిపోయిన తర్వాతే ఆయన గుట్టుచప్పుకాకుండా ఢిల్లీకి వెళ్ళారు లేదా బిజెపి అధిష్టానం పిలిపించుకొని ఉండవచ్చు. కనుక తెలంగాణ బిజెపిలో ఏదో పెద్ద మార్పు జరుగబోతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
బిజెపిలో చేరికల కమిటీకి ఈటల రాజేందర్ నేతృత్వం వహిస్తున్నారు కనుక ఇటీవల ఆయన మరో ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి ఖమ్మం వెళ్ళి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. ఈ విషయం ఆయన కూడా ధృవీకరించారు. అయితే పార్టీలో చేరేందుకు పొంగులేటికి కొన్ని డిమాండ్స్ అంటే కొత్తగూడెంలో తనకు, తన అనుచరులకు టికెట్లు, కాంట్రాక్టులు వగైరా ఉంటాయి. కనుక బహుశః వాటి గురించి అధిష్టానంతో మాట్లాడేందుకు ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్ళి ఉండవచ్చు.
లేదా బండి సంజయ్ అతి కారణంగా పార్టీలో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని, పార్టీలో ఉన్న పలువురు సీనియర్లు కూడా ఆయన నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కనుక మృధుస్వభావి, అందరినీ కలుపుకుపోగల నేర్పు, అన్నిటికీ మించి, కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ బలాలు, బలహీనతల గురించి తెలిసి ఉన్న ఈటల రాజేందర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఢిల్లీకి పిలిపించుకొని ఉండవచ్చు. కానీ అసలు కారణం తెలియవలసి ఉంది. ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగివస్తే తెలుస్తోందేమో?