మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శక్తి సామర్ధ్యాల గురించి ఎక్కువగా ఊహించుకొని, పదవికి, పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఉపఎన్నికలలో ఓడిపోయి నవ్వులపాలయ్యారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి తెలివిగానే వ్యవహరించారు కానీ బిజెపిలో చేరిన తమ్ముడిని గెలిపించేందుకు ప్రయత్నించి ఆయన కూడా ప్రజలు, పార్టీ దృష్టిలో చులకనయ్యారు.
తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 136 సీట్లు గెలుచుకొని తిరుగులేని విజయం సాధించి అధికారం చేపట్టబోతుండటంతో, ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద కూడా కనిపిస్తోంది. కర్ణాటకలోలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఇప్పుడు ఆ పార్టీ నేతలలో కనిపిస్తోంది. తెలంగాణలో తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్ది అని బిఆర్ఎస్ నేతలు కూడా చెపుతున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలలో ఓడిపోయిన బిజెపి, తెలంగాణలో ప్రతిపక్షంలో ఏవిదంగా గెలుస్తుందనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో బిజెపిలో చేరి తీవ్రంగా నష్టపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గూటికి వచ్చేయాలనుకొంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లే అని తాను బిజెపిలోనే ఉంటానని, వచ్చే ఎన్నికలలో కూడా మునుగోడు నుంచే పోటీ చేస్తానని చెపుతున్నారు. కానీ పదవులు, అధికారం, కాంట్రాక్టులే ముఖ్యమనుకొంటున్నప్పుడు, ఏ పార్టీలోఉంటే అవి లభిస్తాయో వాటిలోనే ఉండాలనుకొంటారు మన రాజకీయ నాయకులు అందరూ. కనుక ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం ఖాయమే.