షర్మిలతో ఎవరు పొత్తులు పెట్టుకోవాలనుకొంటున్నారబ్బా?

May 16, 2023


img

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల రాష్ట్రంలో కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్రలు చేసినా ప్రజలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ప్రతిపక్షాలు, మీడియా కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమె మాత్రం రాష్ట్రంలో  43 నియోజకవర్గాలలో తన పార్టీ ఎన్నికలలో ప్రభావం చూపగలదని, కనుక రాష్ట్రంలో అన్ని పార్టీలు తమతో పొత్తులు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. అన్ని పార్టీల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని అయితే పోత్తులకు ఇంకా సమయం ఉన్నందున అప్పుడే తొందరపడటం లేదని వైఎస్.షర్మిల చెప్పారు. 

మొన్న ఆమె బెంగళూరు వెళ్ళి కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ని కలిసి ఎన్నికలలో విజయం సాధించినందుకు అభినందించారు. కనుక ఆమె తన పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. 

వాటి గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెపుతూ, “తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ పార్టీలో ఎమ్మెల్యేలే వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. వారిని వెనక్కు రప్పించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అటువంటి పార్టీలో మా పార్టీ విలీనం అవుతుందని ఎలా అనుకున్నారు?” అని వైఎస్.షర్మిల ఎదురు ప్రశ్నించారు. 

కొమ్ములు తిరిగిన అనేక మంది నాయకులున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే అంత అధ్వానంగా ఉందని ఆమె భావిస్తున్నప్పుడు, ఆమె తప్ప ప్రజలకు పరిచయమున్న ఒక్క నాయకుడు కూడా లేని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి తెలంగాణలో 43 స్థానాలలో ఎలా బలం ఏర్పడింది? ఇంతకీ ఆమె పార్టీతో పొత్తుల కోసం ఫోన్లు చేస్తున్న నేతలు ఎవరు? ఏ పార్టీకి చెందినవారు? అనే సందేహాలు కలుగకమానవు.

ఆమె కాంగ్రెస్ పార్టీని ఎంత తీసిపడేసినప్పటికీ, ఒకవేళ ఆమె తెలంగాణ రాజకీయాలలో ఉండాలనుకుంటే ఎదో ఓ రోజు ఆ పార్టీలోనే తన పార్టీని విలీనం చేయకతప్పకపోవచ్చు. 


Related Post