తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈ హుందాతనం ఉందా?

May 16, 2023


img

పదేళ్ళ తర్వాత మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సిఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డికె శివకుమార్ ఇద్దరూ పోటీపడ్డారు. వారిలో శివకుమార్‌కు ముఖ్యమంత్రి లభించకుంటే ఎమ్మెల్యేలను చీల్చి బిజెపితో చేతులు కలుపుతారని ఊహాగానాలు వినిపించాయి. 

కానీ శివకుమార్ ఈరోజు ఉదయం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, “ కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది. ఆ తల్లికి ద్రోహం చేయాలనే ఆలోచన నాకు ఎన్నడూ రాదు. ఈ పదవులు, అధికారం కంటే కన్నతల్లి వంటి కాంగ్రెస్ పార్టీయే నాకు ముఖ్యం. కనుక నేను పార్టీని వీడుతానని, పార్టీని చీలుస్తానని, పార్టీకి వెన్నుపోటు పొడుస్తానని మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తే వారికి సంతోషంగా సహకరిస్తాను,” అని అన్నారు. 

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పార్టీ కోసం ఇంత హుందాగా వ్యవహరించగలరా?అంటే కాదనే సమాధానం వస్తుంది. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతున్నందుకు తెలంగాణలో కాంగ్రెస్‌ శ్రేణులు పండుగ చేసుకొన్నాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంతమంది రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు?అంటే సగం మంది కంటే తక్కువే అని చెప్పొచ్చు. 

మిగిలినవారిలో కూడా అధ్యక్ష, ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాడుకొంటూనే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికలలో గెలిపించుకొని అధికారంలోకి వస్తామని ఎవరూ నమ్మకంగా చెప్పకపోయినా, గెలిస్తే మేమే ముఖ్యమంత్రి అవుతామని మాత్రం బిగ్గరగా చెప్పుకొని తిరుగుతుంటారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ అనైఖ్యతే వారిని అధికారానికి దూరం చేస్తోందని గ్రహించలేక నిత్యం కీచులాడుకొంటూనే ఉన్నారు. 

కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతలు కలిసికట్టుగా పోరాడి విజయం సాధించడాన్ని, ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాడుకోకుండా పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సిద్దపడుతుండటాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గమనించి తీరు మార్చుకొంటే ఎప్పటికైనా మళ్ళీ అధికారంలోకి రాగలరు. లేకుంటే ఇలాగే ప్రతిపక్షంలో ఉండిపోయి, టికెట్లు, పదవుల కోసం కీచులాడుకొంటూనే రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతామని గ్రహిస్తే మంచిది.    



Related Post