కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌ ఏమైనా గ్రహించిందా?

May 15, 2023


img

ఒకప్పుడు అంటే... తెలంగాణ  రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండేది. కానీ కేసీఆర్‌ దానిని నిర్వీర్యం చేయడంతో దాని స్థానంలోకి బీజేపి వచ్చింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపిలలో దేనికి ఎక్కువ బలం ఉంది? అని ప్రశ్నించుకుంటే కాంగ్రెస్ పార్టీకే అని అందరికీ తెలుసు. అయినా ప్రతీ ఎన్నికలలో బీజేపి- బిఆర్ఎస్‌ పార్టీల మధ్యే ఎందుకు పోరాటం జరుగుతుంటుంది? వాటి మద్య కాంగ్రెస్‌ కనిపించకుండా పోతుంటుంది.... ఎందుకు? అంటే కాంగ్రెస్‌ నేతల అనైఖ్యతే కారణమని చెప్పకతప్పదు. 

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కలిసికట్టుగా పనిచేయలేకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం వాటిలో ప్రధానమైనది సీనియర్ నేతలెవరూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించలేకపోవడం! అందుకే మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ నేతలందరూ కలిసికట్టుగా తమ పార్టీ అభ్యర్ధిని ఓడించుకోవడానికి వెనకాడలేదు. 

అదే... బీజేపికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంతమంది బలమైన నేతలు లేనప్పటికీ, పార్టీ క్యాడర్, ఓటు బ్యాంక్ లేనప్పటికీ, ప్రతీ ఎన్నికలలో సర్వశక్తులు ఒడ్డిపోరాడుతుంటుంది. ఇదే బీజేపిని రెండో స్థానంలో... కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలో నిలుపుతోందని చెప్పొచ్చు.  

ఒకవేళ కాంగ్రెస్‌ నేతలందరూ కలిసికట్టుగా పోరాడితే వారిని ఏ శక్తీ అడ్డుకోలేదని కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు నిరూపించి చూపారు.  కనుక తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కర్ణాటక కాంగ్రెస్‌ విజయం నుంచి ఏమైనా నేర్చుకొంటారా లేదా? అనే దానిపై వారి పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది చివరిలోగా తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు కర్ణాటక ఫలితాలతో ఏమైనా జ్ఞానోదయం కలిగితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం లభిస్తుంది లేకుంటే తెలంగాణ కాంగ్రెస్‌కు బహుశః ఇవే చిట్టచివరి ఎన్నికలు కావచ్చు. 


Related Post