సీఎం పదవికి సిద్దరామయ్య, శివకుమార్ పోటీ... తగ్గేదేలే

May 15, 2023


img

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 135, బిజెపి 66, జేడీఎస్-19 సీట్లు గెలుచుకొన్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పండగ చేసుకొంటోంది. కానీ సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డికె శివకుమార్ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతుండటంతో, పండగ చేసుకోవలసిన ఈ సమయంలో కర్ణాటక కాంగ్రెస్‌లో తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొంది.

నిన్న బెంగళూరులో జరిగిన సీఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోలేకపోవడంతో అర్దాంతరంగా ఆ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యత కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేసి ఆమోదించారు. కనుక కర్ణాటక పంచాయితీ ఢిల్లీకి చేరడంతో ఇద్దరు నేతలు ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. ఈ నెల 24తో కర్ణాటక శాసనసభ గడువు ముగుస్తుంది. కనుక ఆలోగా కాంగ్రెస్‌ పార్టీ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేకపోతే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చడానికి బిజెపి కాసుకు కూర్చొని ఉంది. 

కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో తెలంగాణలో కాంగ్రెస్ నేతల ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. ఈసారి కేసీఆర్‌ని గద్దె దించి రాష్ట్రంలో తప్పక అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేతలు నమ్మకంగా చెపుతున్నారు. పొరుగు రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం వారికి ఆత్మవిశ్వాసం కలిగించిన్నట్లే, ఒకవేళ కర్ణాటకలో వీరిద్దరి పోటీ కారణంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చీలిపోయి ప్రభుత్వం ఏర్పాటుచేయలేకపోతే, ఆ ప్రభావం కూడా తెలంగాణ కాంగ్రెస్‌తో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.


Related Post