తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న హైదరాబాద్, కూకట్‌పల్లిలో ఆత్మగౌరవ దీక్షలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ మాయమాటలతో ప్రజలను మాయచేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తానని చెప్పిన తండ్రీ కొడుకులు తమ కోసం ఇంద్రభవనాల వంటి ప్యాలస్‌లు నిర్మించుకొంటున్నారు తప్ప పేదల కోసం ఇళ్ళు కట్టింది లేదు...ఇచ్చింది లేదూ.
విదేశాలలో చదువుకొచ్చిన కేటీఆర్ ఇళ్ళ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పేద ప్రజలకు గ్రాఫిక్ వీడియోలు చూపిస్తూ మభ్యపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద తెలంగాణకు రెండున్నర లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే, కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇళ్ళు కట్టిందో... వాటిలో ఎన్ని పేద ప్రజలకు ఇచ్చిందో, ఎన్ని లక్షల మంది ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకొన్నారో చెప్పాలి. కేవలం ఏడువేల మందికి ఇళ్ళు ఇచ్చి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళు ఇచ్చేస్తున్నామన్నట్లు గొప్పలు చెప్పుకొంటున్నారు.
పేద ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మరో 4-5 నెలల్లో అధికారంలో నుంచి దిగిపోతుంది. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది. అప్పుడు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ళు కట్టించి ఇస్తాము. ఉచితంగా విద్యా, వైద్యం అందిస్తాము,” అని అన్నారు.
కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఈసారి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చని ఎగ్జిట్ పోలింగ్ సర్వేలు చెపుతున్నాయి. ఇంతకాలం అధికారంలో ఉన్న కర్ణాటకలోనే బిజెపి అధికారంలోకి రాలేకపోతే, ఒక్కసారి కూడా అధికారంలో లేని తెలంగాణ రాష్ట్రంలో ఏవిదంగా అధికారంలోకి రాగలదు?కనీసం తెలంగాణలో అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు బిజెపి వద్ద బలమైన అభ్యర్ధులు కూడా లేరు! అందుకే ఇతర పార్టీల నేతలను పార్టీలోకి రప్పించుకొనేందుకు తిప్పలు పడుతుండటం అందరూ చూస్తున్నారు.అదీగాక, తెలంగాణలో కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నారు. మరి బండి సంజయ్ ఏ నమ్మకం, ధైర్యంతో తెలంగాణలో అధికారంలోకి రాగలమని చెప్పుకొంటున్నారో?
బండి సంజయ్ ముందుగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొని, కొమ్ములు తిరిగిన బిఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించగల అభ్యర్ధులను సిద్దం చేసుకొంటే ఈసారి గౌరవప్రదమైన స్థానాలు పొందగలుగుతారు. కాదని ఇలాగే పగటికలలు కంటూ కాలక్షేపం చేస్తే తెలంగాణలో అధికారం కోసం బిజెపి మరో 5 ఏళ్ళపాటు ఎదురుచూడాల్సి వస్తుందని మరిచిపోకూడదు.