సుప్రీంకోర్టులో నేడు రెండు సంచలన తీర్పులు చెప్పింది. రెండూ గవర్నర్ వ్యవస్థకి సంబందించినవి కావడమే విశేషం. ఒకటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, మరొకరు మహారాష్ట్ర గవర్నర్ తీరు సరిలేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రెండు తీర్పులను చెప్పింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేసు: ఆయనకు కేవలం శాంతిభద్రతల వ్యవస్థ (పోలీస్ శాఖ) తప్ప ఢిల్లీ ప్రభుత్వ పాలనాపరమైన వ్యవహారాలలో జోక్యం చేసుకొనే అధికారం లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలో వివిదశాఖల అధికారులందరూ ముఖ్యమంత్రి (కేజ్రీవాల్)కే కట్టుబడి పనిచేయాలి తప్ప లెఫ్టినెంట్ గవర్నర్‌కి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మహారాష్ట్ర గవర్నర్ కేసు: మహారాష్ట్రలో గత ఏడాది శివసేన అధికారంలో ఉన్నప్పుడు దానిలో ఏక్‌నాథ్ షిండే అనే కట్టప్పని బిజెపి ప్రోత్సహించి ప్రభుత్వాన్ని కూల్పించి బిజెపి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో బిజెపి అధికారం చేజిక్కించుకొనేందుకు గవర్నర్ ఏక్‌నాథ్ షిండేకు అనుకూలంగా వ్యవహరించారు. దీనినే సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది.
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండే గవర్నర్లు, రాజకీయపార్టీల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ సమయంలో ఉద్ధవ్ థాక్రే శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొకుండా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందున ఆయనను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించలేమని తేల్చి చెప్పింది. ఆయనే గవర్నర్ జోక్యం చేసుకొనేందుకు అవకాశం కల్పించారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కనుక గవర్నర్ తన విచక్షణాధికారం మేరకు మెజార్టీ మద్దతు కలిగిన ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించడాన్ని తప్పు పట్టలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది.