సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ సభలలో ‘ప్రజాస్వామ్యం’ గురించి బాగానే మాట్లాడుతుంటారు. ప్రగతి భవన్, సచివాలయం కోసం కేసీఆర్ వేలకోట్లు ఖర్చుచేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు “అవేమైనా నా సొంత ఆస్తులా?తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలు అవి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాటిని అదే వాడుకొంటుందని” అనేవారు.
కేసీఆర్ తన నిర్ణయాలను చక్కగా సమర్ధించుకోగలరని అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్షుది అధికారిక నివాసం వైట్‌హౌసును తలదన్నేలా కొత్త సచివాలయయాన్ని నిర్మించారని మంత్రులు చెప్పుకొంటున్నారు. మంచిదే. అయితే దానిలోకి ప్రతిపక్ష నేతలకు అనుమతి లేదంటే ఎలా?
ఇటీవల బిజెపి ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, అంతకు ముందు పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళబోతే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా ఉన్న సచివాలయంలోకి కాంగ్రెస్, బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేలను అనుమతించకపోవడాన్ని ఏమనుకోవాలి?అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తే, దానికి సమాధానంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా అనుచితంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయనకు అదే స్థాయిలో ఘాటుగా జవాబిచ్చారు. అది వేరే సంగతి.
కానీ “అనాడూ పాత సచివాలయం కూల్చివేసి కొత్తది కడతామంటే అందరూ అభ్యంతరాలు చెప్పారుగా... మరిప్పుడు ఏ మొహం పెట్టుకొని కొత్త సచివాలయంలోకి వస్తారు?” అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించడం సరికాదనే చెప్పాలి. ‘అప్పుడు అభ్యంతరాలు చెప్పారు కనుక… తమ ప్రభుత్వమే సచివాలయంలో కట్టించింది కనుక తాము తప్ప మరెవరూ లోనికి రాకూడదు...’ అని అనుకొంటే సచివాలయం కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంగానే భావించాల్సి ఉంటుంది.
ప్రజాస్వామ్యం గురించి ఊకదంపుడు ప్రసంగాలు చేయడం, సచివాలయానికి డా.అంబేడ్కర్ పేరు పెట్టి, ఆయన భారీ విగ్రహం పెట్టిస్తే సరిపోదు. ఆచరణలో కూడా ప్రజాస్వామ్యం కనబడాలి. కానీ గవర్నర్ అంటే గౌరవం లేదు... ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలంటే గౌరవం లేదు... చివరికి రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే త్రిదండి చిన్నజీయర్ స్వామితో కూడా వైరమే... చెప్పే మాటలకు, వ్యవహరిస్తున్న తీరుకు ఎక్కడా పొంతన కనిపించదని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తున్నా ఇటువంటివన్నీ సామాన్య ప్రజలు సైతం గమనించి పట్టించుకొంటారనే సోయి అధికారంలో ఉన్నవారందరికీ ఉండాలి. లేకుంటే వారే నష్టపోతారు.