ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ సోమవారం సాయంత్రం సరూర్ నగర్‌లో యువ సంఘర్షణ సభలో తెలంగాణ ఉద్యమాలు మొదలు ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాల వరకు అనేక అంశాలపై చక్కగా ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు వలన కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని ప్రజల కష్టాలు తీరనేలేదని విమర్శించారు. కేసీఆర్‌ని గద్దె దించి కాంగ్రెస్‌కి అవకాశం కల్పిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ప్రియాంకా గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు.
నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఏర్పడిందని, కానీ కేసీఆర్ ప్రభుత్వం అంతకు మించి చాలానే చేస్తోందని ప్రతిపక్షాలకు కూడా తెలుసు. సామాన్య ప్రజలు చూసేదీ అభివృద్ధి, సంక్షేమ పధకాలు తప్ప అధికార పార్టీల అవినీతి, అక్రమ సంపాదనలు కావు. ఎందుకంటే అవి ప్రతిపక్షాలకు తప్ప సామాన్యుల కంటికి కనబడేవి కావు కనుక!
ఉదాహరణకు హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో బాధ పడుతుండేవారికి ఉపశమనం కలిగించే ఫ్లైఓవర్లు నిర్మిస్తే ప్రజలు చాలా సంతోషిస్తారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మెచ్చుకొంటారు తప్ప దాని నిర్మాణంలో ఎవరెవరెకి ఎంత కమీషన్ లభించిందని శోధించరు. శోధించినా అది సామాన్యులకు కంటికి కనబడేది కాదు కానీ ప్రతిపక్షాలకు ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక ప్రజలు సుఖపడుతుంటే అవి బాధపడుతుంటాయనుకోవచ్చు.
రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా బిజెపి అధికారంలోకి వస్తే అవి అవినీతికి పాల్పడవని అనుకోలేము. ఎందుకంటే అన్నీ కూడా ఒక రాజకీయ తానులో ముక్కలే కనుక. అందువలన కేసీఆర్‌ను గద్దె దించి, అవి అధికారంలోకి రావాలంటే ప్రజలను మెప్పించగల వ్యూహాలు ఏవో అమలుచేయాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ వ్యూహాల ముందు కాంగ్రెస్, బిజెపిల వ్యూహాలు పనికిరావని పలు ఎన్నికలలో తేలిపోయింది. అయితే ఎంత ప్రజాధారణ ఉన్న పార్టీ, నాయకుడికైనా ఏదోరోజు ఎదురుగాలి తప్పక వీస్తుంది. కేసీఆర్‌కు ఇంకా ఎదురుగాలి ఎప్పుడు వీస్తుందో తెలీదు కనుక అంతవరకు కాంగ్రెస్, బిజెపిలు ఓపికపట్టక తప్పదు.