వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్ధిగా భావించబడుతున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తొలిసారిగా సోమవారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సరూర్ నగర్‌లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్వర్యంలో జరుగబోయే యువ సంఘర్షణ సభలో పాల్గొనబోతున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకొని, మధ్యాహ్నం 3.30 గంటలు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి కాంగ్రెస్ శ్రేణులు వెంటరాగా భారీ ఊరేగింపుగా ఎల్బీ నగర్‌లో చేరుకొని అక్కడ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా సరూర్ నగర్‌లోని సభావేదిక వద్దకు చేరుకొంటారు. టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై ప్రసంగించి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటిస్తారు. ప్రియాంకా గాంధీ సుమారు అర్దగంటసేపు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ తిరుగుప్రయాణం అవుతారు.
ప్రియాంకా గాంధీ తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చి హైదరాబాద్‌లో తొలిసారిగా బహిరంగసభలో పాల్గొంటున్నారు కనుక ఈ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ గట్టిగా కృషిచేస్తున్నారు. కనీసం లక్షమందిని జనసమీకరణ చేస్తున్నారు. ఈసారి కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని సర్వేలన్నీ సూచిస్తున్నందున ప్రియాంకా గాంధీతో సహా కాంగ్రెస్ నేతలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు కనుక 2024లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశం ఉండవచ్చు. కనుక ఈరోజు సరూర్ నగర్‌లో సభలో ప్రియాంకా గాంధీ కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేయకపోవచ్చు.