బిజెపి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు గురువారం ఖమ్మం వెళ్ళి బిఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కలిసి బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించారు. ఈ విషయం పొంగులేటి స్వయంగా మీడియాకు తెలియజేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, “నేను, జూపల్లి కృష్ణారావుగారు ఇంకా చాలామంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించి ఇంతకాలం బిఆర్ఎస్‌లో ఉన్నాము. కానీ తెలంగాణ ఏర్పాటు వలన కేసీఆర్, ఆయన కుటుంబమే బాగుపడింది తప్ప రాష్ట్ర ప్రజల పరిస్థితులలో ఎటువంటి మార్పు రాలేదు. కనుక కేసీఆర్‌ని గద్దె దించి ఆయన అవినీతిపాలనను అంతమొందిస్తానని నేను, జూపల్లి తదితరులం చెపుతున్నాము.
మమ్మల్ని బిజెపిలో చేరమని ఆహ్వానించేందుకు వచ్చినవారితో కూడా మేము ఇదే విషయం గురించే ప్రధానంగా చర్చించాము. పదవులు, పార్టీ టికెట్ల గురించి కాదు. వాటి గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. కేసీఆర్‌ని గద్దె దించేందుకు మాతో కలిసివచ్చేవారందరినీ కలుపుకుకొని ముందుకు సాగాలనుకొంటున్నాము,” అని అన్నారు.
బిజెపి లోకి రమ్మని అడిగారు..కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యం..- ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి#Telangana #CMKCR #EtelaRajendar #PoguletiSrinivasReddy #Khammam #JupallyKrishnaRao #BJP #KCR #BRSParty #brspartyoffice #NTVTelugu pic.twitter.com/Cs8CJawpmE
జూపల్లి, పొంగులేటి ఇద్దరూ కూడా కేసీఆర్ తమను పట్టించుకోవడంలేదని, టికెట్లు, పదవులు ఇవ్వడంలేదనే పార్టీకి దూరమైన సంగతి అందరికీ తెలుసు. అప్పటికీ... కేసీఆర్ తనకు రూ.2,900 కోట్లు విలువగల కాంట్రాక్టులు ఇచ్చారని పొంగులేటి స్వయంగా చెప్పుకొన్నారు. అయినా పార్టీకి దూరం అయ్యారంటే ఆ కాంట్రాక్టులు ఆయనకు సరిపోకపోయి ఉండవచ్చు?అయినా ఈ 8 ఏళ్ళలో ఖమ్మంతో సహా తెలంగాణ రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో పొంగులేటికి, జూపల్లికి కనబడటం లేకనే కేసీఆర్‌ని గద్దె దించాలనుకొంటున్నారా లేక తమకు టికెట్లు, పదవులు, కాంట్రాక్టులు ఇవ్వనందుకే కేసీఆర్‌ని గద్దె దించాలనుకొంటున్నారా?అనే సందేహం కలుగుతుంది.
ఇంత పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేసి డబ్బు సంపాదించుకొంటూ, మళ్ళీ కేసీఆర్ వలన తెలంగాణకు అన్యాయం జరిగిపోతోందంటూ పొంగులేటి ఆరోపించడం విడ్డూరంగా ఉంది. అసలు పొంగులేటి వద్ద వేలకోట్లు ఉన్నందునే కాంగ్రెస్, బిజెపిలు ఆయనను పార్టీలోకి రప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని వేరే చెప్పక్కరలేదు.
జూపల్లి కూడా చాలా సీనియర్ నేత కదా? మరి ఆయన వద్దకు ఎవరూ ఎందుకు వెళ్ళడం లేదు? అందరూ పొంగులేటి చుట్టూనే ఎందుకు తిరుగుతున్నారు? చివరికి జూపల్లి కూడా పొంగులేటి అనుచరుడుగా ఎందుకు మారారు? పొంగులేటి ధనబలం ఉందనే కదా?
ఆ ధనబలంతోనే పొంగులేటి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అభ్యర్ధులను ప్రకటించి వారిని గెలిపించుకొంటానని చెప్పగలుగుతున్నారు కదా? ధనబలం ఉంది కనుకనే తెలంగాణ రైతు సమాఖ్య (టిఆర్ఎస్) అనే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలు కూడా చేస్తున్న మాట వాస్తవం కాదా? కేసీఆర్ రాష్ట్రాన్ని దోచేసుకొంటున్నారని ఆరోపిస్తున్న పొంగులేటి చేస్తున్నదేమిటి?
పొంగులేటి ధనబలంతో జిల్లా, రాష్ట్ర రాజకీయాలను శాశించాలనుకొంటున్నట్లు అర్దమవుతూనే ఉంది కానీ తెలంగాణ ప్రజల కోసం ఆరాటపడుతున్నట్లు పొంగులేటి నటించడం చూస్తే ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అనిపిస్తుంది.