దేశంలో విడాకులు తీసుకొనే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నవేళ, పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు విడాకులకు దరఖాస్తు చేసుకొన్న వెంటనే విడాకులు మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. చాలామంది దంపతులు చిన్న చిన్న గొడవలు, కారణాలతో విడాకులకు వచ్చేస్తుంటారు. అటువంటివారి సంసారాలు కూలిపోకుండా, వారిపై ఆధారపడిన పెద్దలు, పిల్లల జీవితాలు ఛిద్రం అవకుండా కౌన్సిలింగ్‌తో కాపాడేందుకే హిందూ వివాహ చట్టం ఆరునెలలు గడువు పెట్టింది. ఆలోగా పునరాలోచనలో పడి మళ్ళీ కలిసి జీవితాంతం కాపురం చేసినవారు లక్షల్లో ఉన్నారు.
కానీ ఇప్పుడు పరస్పర అంగీకారంతో దరఖాస్తు చేసుకొన్న వెంటనే విడాకులు మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కనుక వారికి పునరాలోచనకు అవకాశం ఉండదు. కానీ ఎట్టి పరిస్థితులలో కలిసి జీవించలేమన్నుకొన్నవారికి సుప్రీంకోర్టు తాజా తీర్పు వరమనే చెప్పాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకి లభించిన విశిష్ట అధికారాన్ని వినియోగించుకొని భార్యాభర్తలు కలిసి జీవించలేరని భావించిన్నప్పుడు వారికి తక్షణం విడాకులు మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ విడాకులు మంజూరు చేసే ముందు న్యాయస్థానాలు తప్పనిసరిగా ఎవరూ నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ఒకవేళ చిన్న పిల్లలున్నట్లయితే వారి సంరక్షణ బాధ్యతలను, ఆస్తిపాస్తుల పంపకాలు తదితర ప్రతీ అంశాన్ని న్యాయస్థానాలు పరిష్కరించవలసి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇప్పటికే సమాజంలో చాలా వెర్రిపోకడలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజాతీర్పుతో విడాకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అప్పుడు సమాజంలో విశ్రుంకలత్వం మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. విడాకులు, దాని పర్యవసనాలపై అవగాహన ఉన్నవారికి, వాటిని తట్టుకోగల శక్తి ఉన్నవారికి ఇది చాలా మేలుచేయవచ్చు. కానీ మిగిలిన లక్షలాదిమంది సంగతి?ఓ సాధారణ మద్యతరగతి లేదా దిగువ మద్యతరగతి కుటుంబాలను, ముఖ్యంగా తల్లితండ్రులపై ఆధారపడిన పిల్లల జీవితాలపై ఇది తీవ్ర విపరీత పరిణామాలు చూపే ప్రమాదం పొంచి ఉంది.