జనగామ
జిల్లా, స్టేషన్
ఘన్‌పూర్ నియోజకవర్గానికి తాటికొండ రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి
తెలిసిందే. అయితే కడియం శ్రీహరి కూడా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చాలా కాలంగా
ఆశ పడుతున్నారు. కనుక స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు కడియం
శ్రీహరి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పనిలో పనిగా ఎమ్మెల్యే రాజయ్య అవినీతి, లైంగిక వ్యవహారాల భాగోతాలను బయటపెట్టి నిలదీస్తూనే ఉంటారు. ఈ కారణంగా వారిద్దరిమద్య
పచ్చ గడ్డివేస్తే భగ్గుమంటుంది.
ఈ నేపధ్యంలో
ఎమ్మెల్యే రాజయ్య నేడు స్టేషన్ ఘన్‌పూర్‌లో తన అనుచరులతో సమావేశమైనప్పుడు, “ఈసారి కూడా స్టేషన్
ఘన్‌పూర్ నుంచి నేనే పోటీ చేస్తాను. టికెట్టూ నాదే గెలుపు నాదే. దీనిలో డౌట్ ఏమీలేదు.
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల గురించి పట్టించుకోనవసరం లేదు. ఎవరూ అయోమయానికి గురికావద్దు.
నేను తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌కు నమ్మిన బంటుగా ఉన్నాను. కనుక నా విధేయతకు
మెచ్చి కేసీఆర్ నాకే మళ్ళీ టికెట్ ఇవ్వబోతున్నారు,” అని చెప్పారు.
రాజయ్య అన్న ఈ మాటలు కడియం శ్రీహరిని ఉద్దేశ్యించి అన్నవే అని వేరే చెప్పక్కరలేదు.
అయితే
నియోజకవర్గంలో రాజయ్యపై ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి. ఇటీవల జానకీపురం మహిళా సర్పంచ్‌ని
లైంగికవేధిస్తే ఆమె ప్రెస్‌మీట్ పెట్టి ఆ విషయం బహిర్గతం చేయడమేకాక, తనతో సంధి చేసుకోవడానికి
వచ్చిన రాజయ్యను మళ్ళీ మరోసారి అలా ప్రవర్తిస్తే చెప్పుతో కొడతానని మీడియా ఎదుటే హెచ్చరించారు కూడా.
దళితబంధు పధకంలో రాజయ్య కమీషన్లు తీసుకొంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఇటీవల పార్టీ సమావేశంలో కేసీఆర్ ప్రత్యేకంగా దీని గురించి ప్రస్తావించి తోక కత్తిరించేస్తానని
గట్టిగా హెచ్చరించారు కూడా. అయినప్పటికీ ఈ సారి కూడా టికెట్ తనకే అని రాజయ్య నమ్మకంగా
చెప్పుకొంటుండటం ఆశ్చర్యకరమే కదా?